మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

30, సెప్టెంబర్ 2026, బుధవారం

చిక్కేపల్లి సావిత్రీదేవి కుటుంబం

మహబూబ్‌నగర్ జిల్లాలో మానాయనగారు న్యాయవాది అయ్యాక శ్రీ చిక్కేపల్లి రాంచందర్రావు ఆయన పేరు వినని వారుండరు. ఆయన న్యాయవాదిగా గొప్ప పేరు చెందినాడు. ఆ కాలంలో కోర్టులో కేసునెట్లా ప్రవేశపెట్టవలెనో అట్లా ప్రవేశపెట్టటంలో ఆయనను మించిన వ్యవహారాలలో మించిన వారెవరు లేరని చెప్పుకునేవారు. ఆయన కోర్టు వ్యవహారాలలో కార్యసాధనలో మంచి నైపుణ్యముండేది గనుక ఏ పని చేపట్టినా అపజయమనేది ఎరుగరు. సాటివారిలో చుక్కలలో చంద్రునివలె బ్రతికినారు. భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో జీవితం గడిపినారు. ప్రతిదినం నిష్ఠతో జపం, పారాయణం చేసేవారు. ఆధ్యాత్మిక గ్రంథాలు చదివేవారు. వకీలుగా ఉండిగూడ ఆయనవలె నిష్ఠాపూర్వకమైన జీవితం గడిపిన వారరుదు. 

మానాయన గారిది కొల్లాపురం సంస్థానంలోని చిక్కేపల్లి గ్రామం. అది ఆనాడొక జాగీరు. అక్కడ ఉన్న మానాయనగారు కొల్లాపురం సంస్థానం తరపున వారి కోర్టు వ్యవహారాలు చూసేందుకు నాగర్‌కర్నూలులో నియుక్తుడైనాడు. అదే కాలంలో వనపర్తివారి కోర్టు వ్యవహారాలు చెఱువు పాండురంగారావుగారు చూసేవారు. వీరుభయుల ఇండ్లు ఎదురెదురుగానే ఉండేవి. నాగర్ కర్నూలులో మకాం పెట్టిన తర్వాత మానాయనగారు పల్లెర్ల హన్మంతరావుగారి దేశసేవతో ప్రభావితులై ఇక్కడ గ్రంథాలయస్థాపన చేసినారు. అప్పటికి గ్రంథాలయ స్థాపనమంటె ప్రభుత్వానికి సందేహాస్పదమైన చర్య. ఆంధ్ర మహాసభ విస్తరణకు గ్రంథాలయం మొదటి మెట్టు. ఆనాడు ప్రథమ గ్రంథాలయ వార్షికోత్సవం మానాయనగారు స్థానికంగా రామాలయంలో జరిపించినారు. అదొక సాహసోపేతమైన చర్య. దానితో వీరు స్వాతంత్య్ర పోరాట వీరులలో గూడ ఒకరై 1939లో హనుమజ్జయంతి సందర్భంగా హనుమదాలయావరణంలో కాంగ్రేసుకు విరాళాలివ్వవలసిందని ప్రజల నుద్బోధించగా ప్రభుత్వమది రాజద్రోహ చర్యగా పరిగణించి మాతండ్రిగారికి మొదటిసారిగా అయిదుమాసాలు కారాగార శిక్ష విధించింది. ఆ పిమ్మట 1948లో రెండవసారి అరెస్టుచేసి జైలులో డిటెన్షనుగా ఉంచినారు. కాని అపుడు వీరి ఆరోగ్యం బాగులేక పక్షందినాలకే ఉస్మానియాలో చేర్చబడి అక్కడ తగినమందులులేక విడుదల చేయబడినారు. అయినా అప్పటి కాలా న్ననుసరించి వారు విడుదలైనా మరో ఆరునెల లజ్ఞాతంగానే గడుపవలసి వచ్చింది. (స్వాతంత్య్రానంతరం ప్రభుత్వ మాయనను 1972లో తామ్రపత్రంతో గౌరవించింది) 

మా తండ్రిగారికి మొదటి సంతానం జానకిరాంరావుగారు. ఆయన మాకందరికి పెద్దన్నయ్య. ఆయనగారు లోకానికంతా మంచివారు. చెడుఅనేది ఆయనలో ఏ కోశాన ఉండేదిగాదు. ఆయనది అందరితో కలిసిమెలసి ఉండే మనస్తత్వం. ఆయనకు తగినట్లుగానే మా వదిన సీతమ్మగారు సాత్విక సంపన్నురాలు. ఆమెదిగూడ కలివిడి తత్వమే. మంచివారికి మరణమే సాక్షి అన్నట్లు ఆయన మరణంగూడ అనుకోని విధంగా హైదరాబాదుకు పనిమీద వెళ్లినపుడు జరిగింది. ఇంటికి రావటానికి పండ్లు వగైరా కొనుక్కొని సిద్ధమై ఆ రాత్రి అక్కడనే ఉన్నాడు. మృత్యుదేవత ఆయన నక్కడి నుండియే తరలించుకొని పోయింది. ఆ మరణ వార్త విని మేమందరము కొంతసేపు స్తబ్ధులమై పోయినాము. ఆయనలేని యింటిలో జీవించటం కష్టమై నట్లనిపించింది. మా కంఠాలన్ని మÖగవోయినవి. ఆయనయొక్క ఆ దర్పం, ఆ ఠీవి, ఆ హుందాతనం మేమెప్పటికి మరువలేము. 

రెండవవారు సీతారాంరావుగారు. వీరు ప్రతిజ్ఞచేసిన భీష్మునివలె బ్రహ్మచారిగా నిలిచిపోయినారు. ఈనాగరిక యుగంలో ఆయనవలె అచంచలంగా ఉండటమరుదు. ఈయనగారిది బ్రహ్మపట్టు. పట్టినదానిని విడిచే స్వభావంగాదు. కోర్టు వ్యవహారాలలో తండ్రిగారిని మించినవాడు. ఈయనకు తెలియని కోర్టు చట్టాల్లేవు. చదువు మాత్రము H.S.్పు. యేగాని, అయితేనేమి ఈయన న్యాయవాదులకే సలహాలు చెప్పగల న్యాయవాది. ఈయనకు తన ఆత్మనే తనకు వేదవాక్కు. మా కుటుంబంలో తండ్రిగారి ఆస్తిని నిలబెట్టిన బిఱుదు నన్నయగారికి ఆదికవివలె ఈయనకొక్కనికే దక్కుతుంది. ఆస్తిని సంపాదించటంగాదు దానిని నిలుపుకొనటం సద్వినియోగపరచటం గొప్పమాట. 

పుణ్యంకొద్ది పురుషుడు వితరణకొద్ది బిడ్డలంటారు. ఎంతో పుణ్యంచేసి ఉంటేనేగాని ప్రపంచంలో పురుషజన్మ లభించదట. మా రెండవ అన్న సీతారాంరావుగారు పున్నమనాడు పుట్టి తనజన్మను సార్థకం చేసికున్నాడు. తండ్రిగారివలె వీరుగూడ పట్టినపట్టు విడిచేస్వభావం గలవారుకాదు. ఒకే మాట ఒకే బాణంగా తండ్రిగారికి తగినబిడ్డడై నిలిచినాడు. సావిత్రి యమునితోపోరి భర్తను బ్రతికించుకున్నట్లు వీరెంతటి కష్ట కార్యాన్నైనా అధికారులతో పోట్లాడి సాధిస్తారు. అందువల్ల నాయనగారి కితనికప్పజెప్పిన పనిచెడదనే విశ్వాసముండేది. . వీరు నాయనగారు జీవించినంతకాలం వారికి కుడిభుజంగా ఉన్నారు. 

మా మÖడవ అన్నయ్య పట్టాభిరాంరావుగారు. ఈయన మొదటిపేరు అయోధ్యారామారావు కాని చదివేకాలంలోనే చాలాకాలానికి మానాయనగారు ఈయన పేరును తమతండ్రిగారి పేర పట్టాభి రామారావని మార్పించినాడు. అనగా మానాయనగారే అన్నయ్యలో తమ తండ్రిగారిని చూచుకున్నారు. వీరి జీవితం గూడ అసాధారణమైనదే. న్యాయవాదవృత్తి చేపట్టి నాయనగారి వలెనే నడుచుకుంటు జిల్లాకేంద్రమైన మహబూబ్‌నగర్‌లో నిలిచి రాణించినారు. మంచి పేరుప్రతిష్ఠలు సంపాదించినారు. ముఖ్యంగా భూముల కేసు విషయంలో వీరికి మంచి పేరున్నది. వీరి సంతానంగూడ అందరూ ఉన్నత విద్యావంతులై అన్నివిధాల కుటుంబాలతో సుఖసంతోషంగా ఉన్నారు. 

వీరితర్వాత నాల్గవదానిని నేను. నాకు మొదట కౌసల్య అని పేరు పెట్టినారటగాని ఎప్పుడు ఏ కారణంచేత నా పేరు సావిత్రిగా మారిందో నాకే తెలియదు. నా జననం క్రీ.శ. 1935, వివాహం 1949. కాని అది జరిగిన కొన్నినెలలకే నాకు పతివియోగం కలిగింది. ఆ పరిస్థితిలో మాతండ్రిగారింకేమి చేయలేక ముందు చూపుతో నన్ను చదువులో ప్రవేశపెట్టినారు. 1950లో నన్ను హైదరాబాదులో శ్రీ సావిత్రీ కన్యా పాఠశాలలో చేర్చినారు. 

అప్పటికి మాచిన్నాయన శ్రీ ఎన్.కె. రావుగారు హైదరాబాదులోనే ఉన్నారు. ఆయన గూడ పేరుచెందిన లాయరు. ఆయన తనయొక్క L.L.దీ.ని అలహాబాదులో చేసినాడు. కాని కాలేజిచదువు హైదరాబాదులోనే జరిగింది. ఆయన సిటీకాలేజిలో చదివే కాలంలో ఆజమ్‌సింగ్ దానికి ప్రిన్సిపాలుగా 

ఉన్నాడు. ఆయనకు మా పినతండ్రిగారి తెలివితేటలు చూచి అభిమాన మేర్పడింది. ఆతర్వాత మాచిన్నాయన L.L.దీ. చేసేనాటికి ఆజంజంగ్ గారు నిజాం ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రియైనాడు. అపుడాయన మాచిన్నాయనను తానెక్కడెక్కడ విద్యాకమిటీలు ఏర్పాటు చేసినాడో అక్కడక్కడ వానన్నిటిలో మా చిన్నాయన నొక మెంబరుగా ఉంచినాడు. 

ఆకాలం నాటికి నైజాం రాష్ట్రంలో తెలుగు బడులు లేవు. అన్ని ఉర్దూ మీడియం పాఠశాలలే ఉండేవి. అందువల్ల మా పినతండ్రిగారికి హైదరాబాదులో ఒక తెలుగు పాఠశాలగూడ ఏర్పాటు చేయవలెననే సంకల్పం కలిగింది. తత్ఫలితంగా ఎగ్జిబిషన్ గ్రౌండు దగ్గర సన్ 1953లో ఆంధ్ర విద్యాలయాన్ని స్థాపించి దానికి శ్రీ వేంకటేశ్వరరావుగారిని హెడ్మాస్టరుగా చేసినాడు. అనంతరం బ్రాహ్మణులకు సంస్కృతం చదివే అవకాశం లేదని సీతారాంబాగులో వేదాంతవర్థనీ సంస్కృతపీఠాన్ని అనంతరం వరంగల్లులో ఆంధ్ర విద్యాభివర్ధనీ పాఠశాలను స్థాపించినాడు. ఆయన ఈ పాఠశాలకు చాదర్ ఘాట్ హైస్కూలులో ప్రిన్సిపాలుగా ఉన్న సుబ్బారాయుడు గారిని లీవ్ పెట్టించి, అక్కడ ప్రధానోపాధ్యాయునిగా చేసినాడు. ఈస్కూలు వరంగల్లులోని మట్టివాడలో 

ఉండేది. సుబ్బారాయడు గారక్కడ హెడ్మాస్టరైన పిమ్మట హైదరాబాదు నుండి కె. మధుసూదనరెడ్డిని పిలిపించుకుని తనకసిస్టెంటుగా చేసుకున్నాడు. 

వేంకటేశ్వరరావు గారాంధ్ర విద్యాలయంలో చేరినపిమ్మట కొంతకాలానికి పాలకవర్గానికి ఆయనకు మనస్పర్థలు కలిగినవి. ఆ కాలం నాటికింకా నాగర్ కర్నూలులో హైస్కూలు లేదు. అది వనపర్తిలో ఉండేది. ఇక్కడి విద్యార్థులంతా అక్కడికే వెళ్లేవారు. ఆ పాఠశాల స్థాపకుడైన రాజా రామేశ్వరరావుగారు దానికొక మంచి హెడ్మాస్టరుగారి కొఱకు చూస్తున్నాడు. ఆయన దృష్టి హైద్రాబాదులోని వేంకటేశ్వరరావుగారిపై పడింది. ఆయన అతనినిక్కడికి పిలిపించుకున్నాడు. 

ఈ వేంకటేశ్వరరావు చాలా సమర్థుడైన ఉపాధ్యాయుడుగా పేరుచెందినాడు. అతనికాలంలో అక్కడి హైస్కూలు చాలా అభివృద్ధి చెందింది. అపుడు మాకుటుంబానికి శ్రీ వేంకటేశ్వరరావు గారితో ఉండే పరిచయంచేత శ్రీ మానాయనగారు నన్ను హైదరాబాదు నుండి వనపర్తికి మార్చినారు. అక్కడ నేను H.S.్పు. పూర్తి చేసినాను. అనంతరం మానాయనగారు నన్నుద్యోగంలో ప్రవేశించమన్నారు. కాని నాకది ఇష్టంలేక మÖడునాలుగు సంవత్సరా లింటిదగ్గరే ఉన్నాను. కాని ఆతర్వాత నాయంతట నేనే ఆలోచించుకుని 17-6-1960 నాడుద్యోగంలో ప్రవేశించినాను. 

నాకు గృహజీవితం కంటె పాఠశాల జీవితమె ఎక్కువగా నచ్చిందని నేను మొదటనే చెప్పినాను. అందువల్ల ఈ పాఠశాల యొక్క జీవితం విద్యార్థులతో అనుబంధం ఇట్లాగే ఉంటె బాగుండు ననిపించేది. అందువల్ల నేను రిటైర్ మెంట్ తర్వాత యింటిలో యేపనిలేకుండ కూర్చోలేక ఒకనాడప్పటి మాప్రధానాధ్యాపకురాలు నిర్మలగారిని రిటైర్ తర్వాత నేను వేతనం లేకుండ ఈ పాఠశాలలో ఇలాగే పనిచేసే అవకాశం కల్పిస్తారా అని అడిగినాను. 

నాకు తెలిసినంతవరకు పిల్లలకు బోధించటంలో ఉన్నతృప్తిగాని ఆనందంగాని అంతకంటె నేనువేరుగా చేయగలిగిన సంఘసేవలో కనిపించలేదు.  మా ప్రధానోపాధ్యాయురాలు అప్పటి నాకోరికను విని నన్నర్థం చేసుకున్నది కనుక నిరాకరించలేదు. ఇది నేనొక అదృష్టంగా భావించినాను. ఆమె తర్వాత ఇపుడు వచ్చినవారు గూడ నన్ను నిరాకరించక పోవటంగూడ నాకు మరొక అదృష్టమే. ప్రస్తుతం నేను పాఠశాలనే ఒక దేవాలయంగా అందులో మనం చిత్తశుద్ధిగా పిల్లలకు పాఠాన్ని బోధించటమే ఆ ఆలయంలో చేసే అర్చనగా భావిస్తూ నేను నేర్చిన కొద్దిపాటి విజ్ఞానాన్ని వారికి బోధిస్తు దానికి న్యాయంచేసే ప్రయత్నం చేస్తూ వచ్చాను.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి