మొత్తం పేజీ వీక్షణలు

6, జులై 2026, సోమవారం

గీతా కల్పతరుం భజే....


అమితాఖ్యానక శాఖలుం బొలిచి వేదార్దా మలచ్ఛాయమై

సుమహావర్గ చతుష్క పుష్పవితతిన్ శోభిల్లి కృష్ణార్జునో

త్తమ వానా గుణకీర్తనా ఫలదమై ద్వైపాయనోద్యానజా

తమహాభారత పారిజాత మమరున్ ధాత్రీ సురప్రార్ధ్యమై     (ఆ.1`66)


గీతా కల్పతరుం భజే భగవతా కృష్ణేన సంశోభితం

వ్యాసేన గ్రధితాం పురాణ మునినామధ్యే మహాభారతం

అద్వైతామృత వర్ణణీం భగవతం మష్టాదశాధ్యాయినీం

అంబత్వమను సంధధామి భగవద్గీతే భవద్వేషిణీం

గీ అనగా వాక్కు. త అనగా నిశ్చయం కనుక గీతాశబ్దానికి నిశ్చ యాత్మకమైన వాక్యమని అర్థం. మనకేదైనా సందేహం కలిగినపుడు పెద్ద వారినడుగగా అందుకు పరిష్కారరూపంగా వారు చెప్పే మాటలన్నీ గీతలే అనబడుతవి. ఈనాడు మనకు గీతావాజ్మయం అపారంగా ఉంది కాబట్టి, ఆ గీతావాజ్మయాన్నంత మనం పై తాత్పర్యంగానే సమన్వయం చేసుకోవలసి ఉంటుంది.

ప్రస్తుతం మనం ప్రసిద్ధంగా చెప్పుకుంటున్న భగవద్గీత మహాభారతంలోని భీష్మపర్వంలో ఉంది. అయితే మహా భారతంలో ఒక్క భగవద్గీతనే గాదు మరింకా ఎన్ని గీతలున్నవో చూడండి.

1. జనక గీత: ఇది అరణ్యపర్వం ప్రథమాశ్వాసంలో 19వ వచనం నుండి 29 వచనం వరకు 11 గద్యపద్యాలలో ఉంది. ఈ గీత`

క. శోకభయ స్థానంబు ల

నేకంబులు గలిగినను విహీనవివేకుం

డాకులత బొందునట్లు వి

వేకము గలవాడు బుద్ధి వికలుండగునే

అని అరంభమై శోకభయస్థానాలు వానినుండి రక్షింపబడే విధానాన్ని తెలుపుతుంది.

2. కశ్యపగీత: ఇది మహాభారతంలోని అరణ్యపర్వ ప్రథమాశ్వాసంలోనే 224వ వచనం నుండి ఉంది.

వ:తేజః ప్రభవంబులైన యమర్ష దాక్షిణ్యశౌర్య శీఘ్రత్వంబులను నాలుగు గుణంబులు క్షమావంతు నంద వీర్యవంతంబులగు 

అనేది దీని సందేశం.

వేదంబులు యజ్ఞంబులు శౌచంబును సత్యంబును, విద్యయు, ధర్మువు  సచరాచరంబయిన జగమంతము క్షమమందు నిలిచినది. తపస్స్వాధ్యాయ యజ్ఞకర్తలయి బ్రహ్మవిదులయుం బడయం పుణ్యగతులు క్షమావంతులు వడయుదురు.

3. దేవగీత: ఇది అరణ్యపర్వంలోనే తృతీయాశ్వాసంలో 259వ వచనం నుండి చెప్పబడింది. 

పూర్వం బాలధి అనే మహర్షి చిరంజీవియైన పుత్రుడు కావలెనని చాలా కాలం దేవతలను గురించి తపం చేసి మేధావి అనే కుమారుని పొందినాడు. అతడు పెద్దవాడైన పిమ్మట వాడు ఆయుష్య గర్వం చేత మహర్షులనెవ్వరిని మెచ్చక ధనుషాక్షుడనే ముని పైకి వెళ్ళగా ఆ మహర్షి కోపించి అతనిని

తే. అంత కాంతికమున కరుగంగ జేసె

గర్వంబుచెట్ట యెట్టివారికైన

గ్రాచు ఆ క్ష£ణంబు గర్వంబు సర్వంబు

నొడిచియున్న వాడ వుత్తముండు (అర.3`260)

అని దీని సందేశం.

సరస్వతీ గీత: ఇది గూడ అరణ్యపర్వంలోనే చతుర్ధాశ్వాసంలో 209 నుండి 215 వరలగల గద్యపద్యాలలో ఉంది. తార్ష్యుడనే మహర్షికి సరస్వతీదేవి భూసురునకు చేసిన గోదాన ఫలితాన్ని తెలుపుతుంది. పిమ్మట అగ్నిీVAత్రం బస్మదాత్మకంబని ఎఱుంగము. సకలయజ్ఞంబులందు గల్గింపబడు విశిష్ట ద్రవ్యంబులన్నియు మదీయంబుల నేను మహనీయంబైన యగ్నిీVAత్రముఖంబున ననుభవించు నాత్కజ్ఞులైన మహాత్ములకు నఖిల సంశయచ్ఛేదంబు సేయుదు ననవరత తపస్స్యాధ్యాయ దానవ్రత పరాయణులైన తపోధనులెందేని విగత శోకులై వసియింతు రట్టిది మామకంబైన పరమపదంబు వినుము ప్రచురమధుక్షీర తోయంబులును, శర్కరా సైకతంబులును, మాంసాపూపప్రకర తీరంబులను, పాయసకర్దమంబులునైన యేఱులనేకంబులుత్పాదించి ఇంద్రాగ్ని ప్రముఖులైన దివిజులకు తృప్తి సేసి యజనశీలురు పెక్కేండ్రు మత్పాదంబు ప్రాప్తింతురు అనేది ఇందలి సందేశం.

5.బ్రహ్మగీతలు: ఇవి శాంతి పర్వంలోని పంచమాశ్వాసంలో ఉన్నవి. జాబాలి తులాధారునికి చెప్పినాడు (ప.246`56) వీనిలో శ్రద్ధా విషయం చెప్పబడింది.

క. యాగంబు నందు శ్రద్ధాయోగ

ముగల శుచి శ్రద్ధ యొనరని శుచిపు

ణ్యాగమ సంపద తుల్యులు

గాగణుతించిరి నిరూపకతనమరవరుల్ (శాం.5.24)

249 వ పద్యంలో ధనం వడ్డికిచ్చి బ్రతకడం పాపంగా చెప్పబడింది. ఇది గమనింపవలసిన విషయం.

6. హారతి గీతలు: ఇవి శాంతిపర్వంలోని 5వ ఆశ్వాసంలోనే 391 నుండి 96 వరకు గల గద్యపద్యాలలో ఉంది. దీన్ని భీష్ముడు ధర్మరాజుకు హరీతుడు విద్వజ్జనాలకు ప్రప్రజనంబు సమీచనంగా ఎరుగదలచిన వారికి చెప్పినట్లు చెప్పినాడు. ఇందులో నిరంతరం ఆత్మారాముడైన యతి ఎట్లుండవలెనో 393 వ పద్యంలో స్పష్టంగా చెప్పబడింది.

7. వృత్త్తగీత: ఇది గూడ శాంతిపర్వంలోనిదే. హరతిగీత వెనుకనే ఉంటుంది.

వృత్రుడింద్రునితో యుద్ధం చేసి యుద్ధరంగంలో పడిపోగా అతని వారతనిని కొనివెళ్లి తమ నివాసంలో పడుకోబెట్టినారు. అపుడతడు నిశ్చింతగా ఉన్నాడు. అతని నిశ్చింతను చూసి శుక్రుని కాశ్చర్యం కలిగి నీ యైశ్వర్యమంతా ఇంద్రుడు హరించినా నీవిట్లా నిశ్చింతగా ఎట్లా ఉండగలుగుతున్నావని అడుగగా అతడు`

తే. కలిమియు లేమియును కాలవశగ

తముల బోధవిహీనుల దర్పదైన్య

కలిత సుఖదుఃఖముల బెట్టుగాక యర్థ

ములయ నిత్యత యెఱిగిన గలదె వికృతి (శా.5-399)

అని అతనికి కాలానుసారంగానే ఆపదలు సంపదలు పోతుంటవి. వాని కెందుకు చింత అని చెబుతాడు.

8. పరాశర గీత: ఇది గూడ శాంతి పర్వంలోని పంచమాశ్వాసంలోనే జనక మహారాజుకు పరాశర మహర్షి చెప్పినాడు. ఈ పర్వంలోని గీతలలో ఇదే పెద్దది. 478 నుండి 539 గద్యపద్యాల వరకు ఉంది. ఈ గీతలో ఇహపరాలకు సంబంధించిన ధర్మ విషయం చెప్పబడింది.

9. హంసగీత: ఇది గూడ శాంతిపర్వంలోని పంచమాశ్వాసంలోనిదే. పరాశరగీత వెనుకనే ఉంటుంది. ధర్మరాజు భీష్ముని దమము, సత్యము, క్షమ అంత గొప్పవా! వానిని ఆర్యులంతా ఎందుకు పొగడుతారనగా దానికి సమాధానంగా చెప్పినాడు. బ్రహ్మ ఒకపుడు బంగారు హంసయై తిరుగుతుండగా సాధ్యులతనిని దమము, సత్యము, క్షమ ఎందుకు గొప్పవని అడుగగా హంస రూపంలో ఉన్న బ్రహ్మవారికి వాని గొప్పతనం ఈ గీతలో వివరిస్తాడు. ఇది శాం. అ.540 నుండి 568 పద్యం వరకు ఉంది. 

10. భూగీతలు: ఇవి అనుశాసనికపర్వంలోని ద్వితీయాశ్వాసంలోని 359 నుండి 360 వరకు గల మÖడు పద్యాలలో ఉన్నవి వీనిని భూదేవి పరశురామునికి చెప్పినట్లు భీష్ముడు ధర్మజునికి చెప్పినాడు.

ఒకరికి దానం చేసిన భూమి తీసుకొని బలవంతంగా ఇంకొకరికి దానం చేస్తే దానివల్ల ఎట్టి పాపసంకటం కలుగుతుందో ఇందులో చెప్పబడింది.

11. అంగీరస గీత: ఇది అనుశాసనపర్వంలోని చతుర్దాశ్వాసంలో 146 వ పద్యం నుండి 159వ పద్యం వరకు చెప్పబడింది. దీన్ని భీష్ముడడుగగా అంగీరసుడు చెప్పినాడు. దీనిలో ఉపవాసŸ విశేషాలు దాని ఫలితాలు చెప్పబడినవి. ఇదే విషయం తరువాత భీష్ముడు యుధిష్టిరునికి చెప్పినాడు.

12. కామగీత : ఇది అశ్వమేధ పర్వంలోని ప్రథమాశ్వాసంలో 128 నుండి 132 పద్యాల వరకు 5 పద్యాలలో చెప్పబడింది. ధర్మార్ధ కామమోక్షాలలో దేనిని కోరేవాడైనా కాముని జయించలేడు. ఏదో రూపంలో అతడే వారిని జయిస్తాడనేది ఇందులోని విషయం. వీనిని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పినాడు.

13. బ్రాహ్మణగీత: ఇది అశ్వమేధ పర్వంలో ద్వితీయాశ్వాస ప్రారంభం నుండి 107 పద్యాల వరకుంది. ఇది ఒక బ్రాహ్మణ దంపతుల సంవాద రూపంలో ఉంటుంది. దీనిలో అంతర్యాగ ప్రకారం ఇంద్రియ మనస్సంవాదము, జీవాత్మ స్వరూప నిరూపణం, జనకునికి విప్రరూపధరుడైన యమునికి జరిగిన సంవాదము అనే అంశాలున్నవి. దీనిని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పినాడు. ఇది దంపతుల సంవాదం గనుక ప్రతి భార్య భర్త చదువుకోవాల్సిన భాగం.

14. అంబరీషగీత: ఈ బ్రాహ్మణ గీతలలోని జనక యమ సంవాదానికి అంబరీషగీతయని మరో పేరుంది. అందులో చెప్పబడిన విషయం అంబరీషుడు బ్రహ్మణునడుగగా వారతనికి చెప్పినట్లు ఉంటుంది.

15. వ్యాధగీత: అరణ్య పర్వంలోని పంచమాశ్వాసంలో గల కౌశిక ధర్మవ్యాధ సంవాదానికి వ్యధగీత అని పేరు. ఇది 27వ పద్యం మొదలుకొని 145వ పద్యం వరకు విస్తరించి ఉంది. ఇందులో కులధర్మావశ్యకత అహింసా స్వరూపము, జీవలక్షణం తల్లిదండ్రుల సేవాఫలం చెప్పబడింది.

ఈ విధంగా మహాభారంతంలో ఒక్క భగవద్గీతనే గాక ఇంకా ఇన్ని గీతలున్నవి కాబట్టి నిజానికి గీతాకల్పతరువనే పేరు మహా భారతానికే చెందుతుంది. అందులోని గీతలన్ని ఆ తరువుకు కాచిన ఫలాలు. వీనిలో భగవద్గీత 18 తొనలతో గూడిన అన్నిటి కంటే పెద్దపండు అనవలసి ఉంది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి