శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి పాటలన్నిటా ఉంటాయి, మలయానిలుడు పెట్టిన ముద్దుల వలన పులకించి, రకరకాల పరిమళాలు వెదజల్లే పుప్పొడుల ముగ్గులు. తంజాపుర యక్షగానాల పల్లవించిన జాను తెనుగు దంతపు నిగ్గులు. తేటిదండులు సేకరించిన కోటి నిషాల మకరందపు పెగ్గులు.
ప్రతి పాటలోనూ యీ మధురమైన రంగు, యీ తియ్యని రుచి, యీ చవులూరించు తీపి వుంటే మొగం మొత్తదా? ఊహు! మొత్తదు. మొత్తనే మొత్తదు. తలపు శృంగారమైనా, ఆధ్యాత్మికమైనా, పిలుపు కన్నెదైనా, ప్రౌఢదైనా, వేడికోలు అలమేలు మంగదైనా, చెంచితదైనా, నాకిది కావాలి అని తెలిసిన గొల్లపిల్లదైనా, విప్రలంభంలో వేగే సురతాణిదైనా, భక్తుని ఆక్రోశమైనా, అనురాగమైనా, త్రీపాటా కొండనెత్తిన గొల్లవాని ముందో, కొండమీది నల్లవాని ఎదుటో బట్టబయలు చేసినంతమాత్రాన తాళ్లపాక పదములు మొగం మొత్తుతాయా?
లలిత లవంగ లతల పొదరిళ్లలో వసంతక్రీడ లాడిన కృష్ణుని గురించీ, అడుగుడుగునకూ తడబడుతూ గోపాల కృష్ణుని రాకకై దిక్కులు చూచు రాధ గురించీ, పచ్చిగా గోవర్ధనోద్ధారుని సురతలీలలగురించీ, పండిన రాధ రాగాలసత గురించీ జగన్నాధంగా, జగన్మోహనంగా ప్రతి అష్టపదినీ తేనె ముంచిన పనసతొన తీరున వెలార్చిన జయదేవుని ధోరణి వెగటనిపిస్తుందా?
రాకెన్రోల్ పాటలనే కాదు రాధామాధవ ప్రణయగీతాలనూ, విలాస గానమే కాదు విషాదాలాపాలనూ, తాత్త్విక చింతనలనే కాదు తమాషా పాటలనూ గుండెలను పిండే వరసలతో, మామిడాకు చివుళ్ల చివరలతో చక్కిలిగింతలు పెట్టే వాద్యగోష్ఠితో గునిసే సి. రామచంద్ర పాటలు ఎన్ని విన్నా విసుగనిపిస్తుందా?
రాష్ట్రీయగీతమైనా, జాతీయగీతమైనా, భావగీతమైనా. అష్టపదిjైునా, జానపద గీతమైనా, ప్రతిభావంతులు తయారించిన ప్రతి వెండి కంచాన్నీ, తన కంచు కంఠంతో నింపి మా తెలుగుతల్లికి సుందరమైన మల్లె పూదండ లల్లిన టంగుటూరి సూర్యకుమారి పాటలెన్నిమార్లు విన్నా చాలనిపిస్తుందా?
కామసూత్ర నుంచీ, కార్ల్‌మార్క్ నుంచీ, హిందూ యిస్లాము మత సూక్తుల నుంచీ, బైబిల్ నుంచీ, వేదాల నుంచీ పగడాలనూ పచ్చలనూ ఏరి తెచ్చి, సామాన్యునికీ వాటి దీప్తి అందేటట్టు వాటిని తొలిచీ, మలిచీ, వేలాది మలయాళ చలచిత్రగీతాలు అనితర సాధ్యమైన మణిప్రవాళశైలిలో తీర్చిన వయలార్ రామవర్మ సాహిత్య సాగరంలో యీదితే చికాకు కలుగుతుందా?
వేసవి తరువాత తొలకరించినప్పుడు పుడమితల్లి ప్రసవించే మట్టి వాసనా, వేకువజామున వీచే మలయామారుతమూ, ఆణిముత్యాల మెత్తని వెలుగూ, హరిచందన గంధము, నిదురించే పాపాయి పెదవుల తారాడే చిరునవ్వూ యిక చాలు అనిపిస్తాయా? ఎవరికైనా?
ముదిగొండ లింగమూర్తి గారంటే నాకు అభిమానమూ, గౌరవమూ. నేనంటే ఆయనకు వాత్సల్యమూ, చనువూ. ఒకనాడన్నారు నాతో ‘‘మీ గురువు గారికి డైలాగులు వ్రాయడం చేతగాదయ్యా’’ అని. నా ముఖంలో ప్రజ్వరిల్లిన ఆగ్రహానలం గమనించి వెంటనే, ‘‘అది కాదు, రాజుకీ, పరిచారికకూ, తోటమాలికీు అందరికీ ఒకే విధంగా రాస్తాడయ్యా అతను’’ అని వివరించారు.
‘‘చక్కెర పాకంలోనే గదా జిలేబీనీ, గారెనూ వేస్తారు? మెంతి పెరుగుకీ, పప్పుచారుకీ కూడా తాళింపు పెడతారు గదా? షేక్స్‌పియర్ చేపలమ్ముకొనే దానికైనా, సింహాసనారూఢుడైన రాజుకైనా తన ‘బ్లెండ్ వర్స్’లోనే కదా వ్రాసింది?’’ అని నేను రెట్టిస్తే ‘‘వాటన్నిటికీ తరువాత జవాబు చెబుతాను’’ అన్నారు కాని ఆ రోజు రాలేదు. రాదు.
ఎన్ని పాటల్లోనో, ఎందరి పేర్లతోనో వచ్చిన సినిమాసాహిత్యంలోనో వారి ముద్రికలైన మెరుపులు అక్కడా యిక్కడా తళుక్ తళుక్కని మెరసినా షోడశకలాప్రపూర్ణమై వారి లేఖిని పున్నమి వెన్నెలలా పిండారబోసింది ‘‘రాజనందిని’’ (1958) లోనే. సంభాషణలుదాహరిస్తే అందరికీ గుర్తుండక పోవచ్చు. కాబట్టి పాటలతోనే సరిపెడతాను.
అనునిత్యం శివసేవా దురంధరుడై, రాజుకి కర్తవ్యభారముపదేశించే ఘటికుడేలాగ దైవాన్ని స్తుతిస్తాడు?
ఆనందగంగా తరంగాంతరంగ
అరుణ ఘనాఘనా జటామండలీ
తరుణేందు కళాభరణా!
అని.
మరి విదూషకుడేలా పేట్రేగుతాడు,ఈ వీరశైవం ఊపుతోనే?
కొమ్ములు తిరిగిన గొఱ్ఱె పొటేలు
గుభేలు మంటూ కొండను కుమ్మితే
కొండకు లోటా? గొఱ్ఱెకు చేటా?
చెప్పర దేవా సాంబశివా కను
విప్పర దేవా సాంబశివా!
అని.
ఆ విదూషకుడే యవ్వనసరాగంతో అనురాగాన పాడితే?
నిలుచుంటే నిద్దుర రాదు
కూచుంటే మెలుకువ రాదు
రోజంతా చీకటి పోదు
చీకటి వేళకు యెన్నెల రాదు
ఎందుకో చెప్పలేను తందాన తాన
నేనేమై పోవాలో తానా తందాన
మరొక మగవాడు, వీధి నర్తకికి ఆటలో, దొంగాటలో, దోపిడీలో చేదోడుగా నిలిచేవాడు. అతడేమంటాడు?
సై! తస్సలరవల!
ఇద్దరు జవరాండ్రు, యిద్దరూ నాయికుని ప్రేమించినవారే. బందిపోటు నాయకుని కూతురొకరు. రాకొమరితమరొకరు. వారి ప్రేమాలాపనలలో తేడా....... ఎందుకుండదు!
‘నీటైన సినవోడ’ అని పిలిచి, ‘సివురంటీ సిన్నదానోయ్, ఓ దొరా! సేవున్నా సిలక నోయ్’ అని చేప్పే దెవరు! ‘అందాల నెలబాలుడా, కలువరేకలలాంటి కనులు మూయంగానే కలలెన్నో నినుకమ్మి నిలువ నీయవులే, అది నాకు తెలుసోయ్’ అనగలిగే దెవ్వరు! ‘సన్నజాజి జాలరిలా యెన్నెలుందిరా యెదరా యేడికుందిరా, సక్కిలగింతల సల్లని గాలిలో సినవోడ సంపంగి గుమాయింపురా! అని హెచ్చరించే హౌసుగత్తె ఎవరు?
ఈ పిలుపులకు ఆ రాకుమారుని జవాబు? ‘అందాలు చిందు సీమలో, ఉందాములే హాయిగా!’
ఇద్దరు నర్తకీమణులు. ఒకతె చెఱపట్టిన వాని చీల్చి చెండాడ నెంచినది, ఆమె చెప్పేమాట, చేసే హెచ్చరిక ‘చెంగున ఎగిరే లేడి కూనను, కన్నె లేడి కూనను, సురకోరల పులిరాజా, యిక యీపేట చాలించరా! ఒర దూసిన కైజారునురా.... ఇక యీ కన్నె కౌగింట నీ కన్నుమూతేరా’ అయితే, వేగు తెలుసుకోదలచిన విలాసిని విసిరిన వల ‘తీగె మీది పువ్వులాగ, తేనె మీది జున్నులాగా’ వుంటుంది.
మరొక స్త్రీ, నర్తకి కాదు, రాజుకి తలలోని నాలుక, పరుపుపై దిండు, మెడకు చందనపు పూత, చెవికి కోయిలకూత, తల్లిలేని బిడ్డకు దాది, మొలనున్న కత్తి, కథనొక కొలిక్కి తీసుకురావడానికి గజ్జెకట్ట వలసి వస్తే ఏమని పాడుతుంది? ‘జిత్తులన్నీ నీవే, పై ఎత్తులన్నీ మావే, ఉక్కిరిబిక్కిరి కాకురా, ఊరించే పాట మాదిర’ అని.
వీరందరి మాట ఒకేలా ఉండదు. కూత పట్టిన కోయిలకటి. క్రీంకరించే నెమలి మరొకటి. ఒకటి వీణ, ఒకటి సితార, మరొకటి శతతంత్రి. వేరొకటి వింటినారి.
తెలుగులో అనుపమాన సంగీత సాహిత్యంతో వెలిగిన సాంఘికం ‘‘చిరంజీవులు’’ (1956). ఇందులో సంగీతం, పాటలు, సంభాషణలు, కథాసంవిధానం సంగీతమయ సామాజిక చిత్రాలకు కొలమానమయ్యాయి. వీటిలో అంతకు మించిన చిత్రం యింకా రాలేదు యిక రాబోదు. అందున్న ‘తెల్లవార వచ్చె’ పాటను శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రిగారూ, ఒక చదువుకొన్నవారూ, యిద్దరూ చిన్నచూపు చూచారు. ఒకరు పెద్ద మనసుతో, మరొకరు చిన్నతనంతో.
ఆ జానపదం చరణమొక తీరున సాగుతుంది. శృంగారం, భక్తి, వాత్సల్యం అన్నీ వేటికవే తేలుతుంటాయి. అవన్నీ మరగ్గాచి, మీగడకట్టించి, తఱకలు నాలుకకు తగలకుండా వడబోసి, స్వచ్ఛమైన మాతృప్రేమ, వాత్సల్య భావం, యశోదా రసం చిప్పిలేలాగ మల్లాది రామకృష్ణగారు దానిని నభూతో నభవిష్యతి అన్న తీరులో తీర్చిదిద్దారు.
మల్లాది రామకృష్ణ శాస్త్రిగారికేం తెలుసు మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి గొప్పతనం?
ఈ ఠీవీ, ఠేవా వారి పాటల్లో ఎన్నింటిలోనో కనబడతాయి. కొన్నిటిలో ప్రస్ఫుటంగా. కొన్నిటిలో చాపకింద నీరులా, దాకొని జలదాంతర్భాగాన దాగిన నీటి బిందువులో యింద్ర ధనస్సు నక్కిన రీతి. ఎదుటనున్న మేఘాలయవనికపై ఫెళ్లున నీలిగే హరివిల్లులాగ. ఇదేంగులహంగు గడ్డిపోచపై, సాలీడు గూడులో చెక్కిన నీటి బిందువులోనూ ఉంది. జలపాతాల ఒలిపిరిలోనూ ఉంది.
ఇన్ని చెప్పి మరొకటి చెప్పకుండా ఉండలేకపోతున్నాను. వారు కృష్ణునిపై వ్రాసిన ఎన్నోపాటల్లో, వేంకటేశ్వరునిపై వ్రాసిన ఒక్క పాటలో తొణికిసలాడే మేలాలమాల గురించి. అటు స్తుతి, యిటు నిందాస్తుతి, రెండూ కావు. ఆధ్వనిలో నాకు రాధ ఎత్తిపొడుపు, గోపికల హేళన, విదురుని లాలన, ఉద్ధవుని ఊరడిరపు, సత్యభామ ఎకసక్కెం, కుబ్జ ఆహ్వానం, చేలుని కృతజ్ఞత, గోపబాలకుల నిండు నెయ్యం ు యీ సరాగమాల ప్రతిధ్వని నాకు వినిపిస్తుంది.
ఇంకొక్క మూడు మాటలు. మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి పాటలు పరిమళలహరులు. పిలిచిన పలికే వీణలు. ఆనందలహరులు. జ్ఞాపకం వస్తే చాలు పెదవిని చిరునగవును మొలిపించ గలిగిన జాణలు. ఇంత చెప్పీ ఆ రామకృష్ణునిపై యీ రంగడు చెప్పినది చాలదనిపిస్తే ..... అది నిజం!
లక్షలు వ్యయం చేసి నిర్మించిన వర్ణ చిత్రం ‘‘రహస్యం’’. ఇందులో కొన్ని కాలాలపాటు ప్రజలు గుర్తుంచుకునే అంశాలు ఎన్నో లోకపోయినా, ఉన్నవాటిలో ఉదాత్తమైనవి మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి పాటలు, శ్లోకాలు, పద్యాలు, గిరిజా కళ్యాణ యక్షగానమూ వాటికి ఘంటసాల అమర్చిన సంగీత పరిమళమూ. ఈ సువాసనలో కూడా కొంత భాగం - అంటే, కొన్నిటి రాగనిర్ణయం కూడా శాస్త్రిగారిదే. కాని, సాహితీకారుడు సూచించిన రాగంలోనే సందర్భ శుద్ది గల వరుసను ఏర్పరచి రక్తి కట్టించిన ఘనత మాత్రం ఘంటసాలది.
ఇంతకు ముందు ఘంటసాల సంగీతమూ, శాస్త్రిగారి సాహిత్యమూ కలసి విరిసిన నిత్యమల్లి పూదోట ‘‘చిరంజీవులు’’. ఈనాటికి అందున్న పాటలు సాహిత్య సంగీత రస పిపాసమలకు ఆనందదాయినులే కదా!
‘‘రహస్యం’’లో మొట్టమొదటి పాట శాస్త్రిగారిదే. చిత్రం మొత్తం మీద ఆరు పాటలూ, రెండు స్తుతులూ, ఒక పద్యం- ఇవన్నిటి మేలు కలయిక అయిన ‘గిరిజా కళ్యాణ’ యక్షగానం- వీరి రచనలు. ఇంతకూ, మొదటి పాట ఆంధ్రులకు యిష్టదైవమైన శ్రీ వేంకటేశ్వరుని విందాస్తుతి. ‘తిరుమల గిరివాసా దివ్య మందహాసా...’ అని రెండు సుందర సమాసాలలో కొండలరాయుని ఉనికినీ మనికినీ మనసులో పదిల పరచేది. రాగం మోహనం. వెనుక వినబడే శుద్ద కర్ణాట శైలి వాద్యానుకరణ సమ్మోహనం. నవ విధాలైన భగవద్భక్త బంధాలలో ఉత్తమమైనది శృంగార భక్తి. మీరాబాయి, జయదేవుడు, నారాయణతీర్ధుడు ఆ సరళిలోనే తమ సరస శృంగార రచనలు సాగించారు. ఈ భక్తిని ఎరిగిన వారే వ్రాయగలరు. యిలా కొంత వెక్కిరింతతో, కొంత వేడికోలుతో.
సిరిగల వాడవు నీవని సరసుడవనీ దరిజేరగా
సానంద పరమానంద మమ్మేల
సిగపాయ చేనంది చిడిముడి జేసేవు
అని అడగడం యీ పాటలోని ప్రత్యేకత. ఒక విశేషణం వాడిచే అది సార్ధకమై ఉండాలి. అందుకే పై ప్రయోగాలు శబ్ద భావ సౌందర్య విలసితాలు. శ్లేషాలంకార సమన్వితాలు చూడండి. ‘మమ్ము ఏల (పాలించ) మమ్ము ఏల (ఎందుకు) సిగపాయ చేనంది (జుట్టు పట్టుకొని చీకాకు పెట్టేవు) సిగపాయ చేనంది (తల నీలాలు చేకొని) మము పాలించుటకు జుట్టు పట్టుకోవలెనా అని మల్లాది వారి మలయమారుతము వంటి మందలింపు. ఆ పరమానంద రూపానికే మందహాసము తెప్పించగల మందలింపు! తెలుగు శబ్ధంలో నున్న కమ్మదనాన్నంతా ఈ పాటలో ఘంటసాల తమ కంఠంతో కుమ్మరిస్తారు.
రక్త భీషుని దేవీ స్తవాలు రెండు ఉన్నవి. ‘త్రయీ కదంబ మంజరీ’ అని మొదలయ్యేది గంభీర పదజాలంతో భక్తుని అనుగ్రహించడానికి వచ్చుచున్న దేవీ పద ఘట్టన ఘోషను జ్ఞప్తికి తెస్తుంది. దీనికి రాగం లేదు. వేదంలా నాలుగైదు స్వరాలలోనే పలుకుతుంది. రెండవది- ‘మందార మకరంద సందోహతుందిల’ అన్నది. జయదేవుని అష్టపదులు ఎలా అర్ధం తెలియని శ్రోతనూ తమ మృదుల పదజాలంతో ఆకట్టుకుంటాయో- ఈ స్తుతీ అలానే ఆకర్షిస్తుంది. దీని రాగం ఆరభి. ఈ రెండిటినీ సమయోచిత ధీర, భక్తి భావాలతో మాధవపెద్ది పాడారు.
ఇందున్న మల్లాది వారి ఒకే ఒక పద్యం ఆటవెలది.
కనుల నిండుభక్తి కరుణయె జనకుడు
కన్నతల్లి, ఎదుటనున్న తల్లి
పరమ పారవశ్య పరిపుర్ణమీ జన్మ
అంతరంగ నిలయ ఆది దేవి
సులభమైన మాటలలో, స్వల్పమైన నాలుగు పాదాలలో అనల్పమైన భావాన్ని ప్రతిష్టించడం అందరికీ అలవి కాని పని. ఈ పద్యం పాడినది లీల.
బ్రహ్మలోక, వైకుంఠ, కైలాసాలలో సరస్వతిని, లక్ష్మిని, పార్వతిని కొనియాడుతూ నారదుడూ, బృందమూ గానం చేసిన పాటలు ఎన్ని ఉపనిషత్తుల సారమో.
సరస్వతి నుద్ధేశించిన పాట రాగం సరస్వతి. ‘లలిత భావ నిలయా, నవరసానంద హృదయా’ అని సంభోదన. మధువు చిలుక గనుక మొలుకు వర వీణా పాణీ అని వర్ణన. లక్ష్మిని ఉద్దేశించిన పాట శ్రీరాగం. ‘రాజీవ రాజీవలోల’ అన్న మాటను విరుపుననుసరించి అర్థం చెప్పుకోవచ్చు. పార్వతిపై గీతం లలిత రాగం. ‘ప్రణవ కామా ప్రణయధామా’ అన్న వర్ణన లలితంగా ఉన్నది.
ఈ రాగమాల వెనువెంటనే వినవచ్చు ‘జలజాతసన’ అను పద్యం రామకృష్ణశాస్త్రి రచనా ధోరణిలోనే ఉన్నది పాటల పుస్తకంలో వేరొకరి పేరు వేసినా. ఈ పద్య రాగం హంసానంది. పై మూడు పాటలకు, ఈ పద్యానికి ఉండదగినంత ఉత్తమంగా వాద్యగోష్ఠి అమర్చబడినది.
‘ఆనంద కృష్ణా’ అన్న పేరు మల్లాది వారికి ప్రియమైనది. దానినే తత్వంలో ఉపయోగించారు. ఈ రచనలో దాగిన వేదాంతం విడమరచి చెప్పడానికి వేదాంతులే రావాలి. సాధారణులకు అర్ధం కాదు. కాని ‘జగమంత ఆణువేది, అణువంత మహిమేది, ఆదిలో కలదేది ఆద్యంతమేది’ అన్నది పిచ్చివాని ప్రశ్న కాదు. త్రాగుబోతు వదరుడూ కాదు. ‘ఏడు వన్నెల పంజరమేది, పంజరాన చిక్కి పట్టశక్యం గాని’ అన్న పలుకులు ‘‘దేవదాసు’’ చిత్రగీతాలపై కొత్త వెలుగును ప్రసరించక మానవు. జానపద ధోరణిలోనే నాదనామక్రియ రాగాన్ని వినిపించిన విశిష్ఠత ఘంటసాలకే దక్కింది.
పి. లీల పాడిన సురటి రాగ కీర్తన ‘శ్రీ లలితా శివజ్యోతి’ అన్నది ఆదిన భక్తి గీతానికి, అంతాన స్త్రీల మంగళహారతులకూ చక్కని ప్రతీక. లలిత నిజంగా లలితేనని చెప్పటానికి కాబోలు ‘జగముల చిరునగవుల పరిపాలించే జనని’ అన్నారు గురుదేవులు.
మోహన మేళంలో ఘంటసాల, లీల ఆలపించిన యుగళగీతం ‘ఏవో కనులు కరుణించినవీ, ఈ మేను పులకించనదీ’ అన్నది. ‘లలిత లలిత మధురానుభావముల మనసు తపోవనమైనదీ’ అని ప్రియుడు పునీతుడై పాడగా ప్రేయసి మదిలో మలయానిల నాదామోదముతో పరిమళ లహరులు విరియుటలో ఆశ్చర్యమేమున్నది?
సినిమా గీతాలకు సాహిత్య సమపంక్తినిచ్చి గౌరవించిన వారిలో మాల్లాదిని మించిన వారెవరు? సినిమా గీతాలలోనే జాజి పందిళ్లు వంటి జావళీలను వెలయించిన రామకృష్ణ శాస్త్రిగారు. ‘మగరాయ, వలరాయ ఈ వయ్యారి నీ సొమ్మురా’ అని పిలిచినా రాని వాడు మగరాయుడు కానే కాడు. రాయి వాడు. ‘చిక్కని వెన్నెల చిందే వేళ, అందని అందాలు అందే వేళ, మనసే మల్లెల పానుపు వేయును’. అవును మరి సరసాలకు నెరజాణయిన నాడే రాజసాలు మాని రంజింప వచ్చిన ప్రకృతి పడతితో ఆ మాత్రం సహకరించడా? ఈ రాగ గీతం రాగం రాగేశ్వరి అన్న ఔత్తరాహిక రాగం- కొంత మన నాటకురంజికి దగ్గరగా ఉంటుంది.
ఇక మిగిలింది ‘గిరిజా కళ్యాణం’. ఇది సుమారు పది సంవత్సరాల క్రిందట ఎవరో తీయబోయిన ‘‘ఉషా పరిణయా’’ నికని కథావసారర్దం రామకృష్ణశాస్త్రిగారు వ్రాసినది. ఆ చిత్రం ఆగిపోవడంతో యీ యక్ష గానం అలానే ఉండిపోయింది. కొన్నేళ్లు క్రిందట శాస్త్రిగారి అనుగ్రహానికి పాత్రులయిన కొందరు కృష్ణాష్టమికి ప్రత్యేక కృష్ణ సంచికగా ‘‘జ్యోతి’’ మాస పత్రికను వేయ సంకల్పించగా తమ ఆశీస్సులతో శాస్త్రిగారు ఈ ‘‘కేళీ గోపాలా’’న్ని యిచ్చారు. అలా రెండవ మారు వెలుగులోనికి వచ్చి, (వెలుగె వెలుగులోనికి రావటం కూడా వేదాంతంలోనే సాధ్యం) ‘‘రహస్యం’’ చిత్ర నిర్మాతల దృష్టిలో పడి, కొద్ది మార్పులతో యీనాడు అశేష ఆంధ్ర ప్రజానీకాన్ని అలరించుతున్నది.
పరిమిత జ్ఞానులు కూడా యిందున్న ప్రతి శకలం గూర్చి ఒక వ్యాసం వ్రాయవచ్చు. ఎన్ని బృహత్గంథాల సారమిందులో యిమిడి ఉందో రోజుల తరబడి చెప్పుకోవచ్చు. ఈ సంగీత సాహిత్య మేళవింపులోని గుబాళింపు యుగాల వరకు ఆనందించవచ్చు. కాని కొంతలో......
ఈ నృత్య నాటికలో కాంబోజి, శ్రీ, అఠాణ, వసంత, రీతిగౌళ, బేగడ, శహనా, సావేరి, సామ, హిందోళ రాగాలు ఉన్నవి. పూర్తిగా స్వర్ణాక్షరి పలికిన ‘సామగ సాగమ సాధారా’ అన్న హిందోళ రాగ గీతం ‘తగదిది తగదిది’ అని మృదంగానికే దరువులు నేర్పిన వసంత రాగ గీతం విలక్షణ లక్షణ సమన్వితాలు. సామరాగాన పార్వతీ శివుని సామగుణాన్ని వేడిన ‘అంభాయని అసమశరుడు’ అన్న పాట రామకృష్ణశాస్త్రిగారి రాగనిర్ధేశ విభవానికి మరొక మచ్చు తునక.
ఘంటసాల సంగీత దర్శకత్వమూ, వెంపటి, వేదాంతం రాఘవయ్యల నృత్య లాఘవమూ యీ యక్షగానంలో కలకాలం నిత్య వసంత శోభతో అలరార గలవు. నిజానికి గిరిజా కల్యాణం వసంత విజయమే గదా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి