మొత్తం పేజీ వీక్షణలు

17, ఆగస్టు 2025, ఆదివారం

ప్రసిద్ధకావ్యము రామాయణము

భారతీయులకు వేదములు పరమప్రమాణమైన ఆదిగ్రంథములు. కానీ వానిని సామాన్యులర్థము చేసికొనుట కష్టం. అందువలన మహర్షులు వేదములపిమ్మట వీని యర్థములను వివరించుటకు కావ్యేతిహాసపురాణములను దర్శించి లోకమునకందిం చినారు. అట్టివానిలో వేదములందలి ఋగ్వేదమువలె రామాయణం సాహితీజగమున మొదటిది.

నేడు మన అందుబాటులోనున్నవానిలో ప్రసిద్ధమైనపురాణము భాగవతం. ప్రసిద్ధ్దేతిహాసము భారతం. ప్రసిద్ధకావ్యము రామాయణము.ఈ మూడుగ్రంథములు భారతీయులకు త్రిసంధ్యలవలె సావిత్రి, గాయత్రి, సరస్వతులవలె ఉపాసింపదగినవి. ఆ యుపాసమునగూడ మరల ప్రథమస్థానము రామాయణమునకే దక్కును. భారతీయు డుదయమున ప్రాతస్సంధ్యయందు సావిత్రిని జపించవలెను. పిమ్మట ఇంటిబాధ్యతలు జూచుకొనవలెను. కనుక  రెంటి నెరుగుటకుగాను గాయత్రీమంత్రమయము, గృహ జీవితప్రపంచితముగను రామాయణమును పారాయణముగా విధించిరి.

‘ఇంటగెలిచి రచ్చగెలువు’ మను సామెత మీరెరుగనిదిగాదు. మన యింటిపిమ్మట చూసుకొనవలసినది ఆ పిమ్మట మాధ్యాహ్నికసంధ్యయందు ఉపాసింపవలసినది  గాయత్రి. అందువలన దానినెరుగుటకు వైయాసికసంహితమైన సమాజనీతి ప్రదర్శింప బడిన భారతమును మధ్యాహ్నం కాలక్షేపమునకు నిర్ణయించిరి. త్రిసంధ్యలలో సాయం కాలమున సరస్వతినుపాసింవలెను. అందువలన రాత్రికి సుస్వప్నములుగనుచు సుఖనిద్ర నందుటకు సరస్వతికి వాగ్రూపమైన భాగవతమును రాత్రిపఠించుటకు  నిర్ణయించిరి. ఇది సర్వజనోచితమైన భారతీయ సామాన్యనియమము.  ఇక వీనియందు మొదటిదగు రామాయణము నరయుదము.

రామాయణమును వాల్మీకి రచించెను. కొందరది వాల్మీకి కల్పించెనందురు. మరి కొందరది కాలచక్రమున పునరావృత్తమగు సంఘటనయందురు. మరికొందరు జరిగిన దందురు. వీటిలో ఏదినిజమని ఆలోచించినపుడు అది నూతనముగాదనియే చెప్పవలసి యుండును. కాలమున కొన్ని విషయములు లేదా కొన్ని సంఘటనలు ఒక క్రమమున పునరావృత్త మగుచుండును. అందువలన మహర్షులు కాలమును చక్రముతో పోల్చిరి.

నేడు మనకు వర్ష మాస వారములు పునరావృత్తమునకొక ప్రబలనిదర్శనము. అరువదేండ్లకొకపరి సంవత్సరములు, పన్నెండునెలలకొకపరి మాసములు. ఏడేసి దినములకొకపరి వారములు వచ్చినవే మరల వచ్చుచుండును. అటులే అనంతమైన ఈ కాలమున అయా యుగములందు  జరిగినకథలే మరలమరల జరుగుచుండును. అట్టివానిలో కృతయుగమునందలి సముద్రమథనము, త్రేతాయుగమునందలి రామోద్భవము, ద్వాపరమందలి భారతము ముఖ్యమైనవి. ఇవి వారములందలి తిథి భేదములవలె ఈషద్భేదములతో మరలమరల జరుగుచున్నవి. కనుక ఇట్టికథలన్నిటిని మహర్షులు దివ్యచక్షువులతో దర్శించి పురాణవాఙ్మయమున బంధించిరి. కనుక రామాయ ణమా యుగమున కొత్తగాని కాలమునకు కొత్తగాదు.

నేడు మనమేడవ మన్వంతరమున నిరువదినాల్గవ కలియుగమునందున్నాము. కనుక రామకథ యీ మున్వంతరమందే నేటి రామాయణమునకు మొదలిరువది మూడు పర్యాయములు గడిచినది. ప్రతిపర్యాయము దానికొక మహర్షి కారణజన్ముడైపుట్టి రచించుచు వచ్చెను. కనుక నీ యూగమున వాల్మీకి దానినేల రచించెనోచూతము.

వాల్మీకి రామాయణము :

కారణంలేకుండా ఏ వ్యక్తి ఏ పనీ చేయజాలడు. అటులే కవికి కావ్యరచనకు గూడా  నేదేని కారణముండవలెను. వ్యాసమహర్షికి బ్రహ్మయాదేశమున నాలుగు వేద ములుగా విభజించినప్పటికి రచయితకు కలుగవలసిన యాత్మతృప్తి కలుగలేదట. అపు డతడు దానికికారణమేమిటని యాలోచించుచుండ నారదుడేతెంచి మహర్షీ నీవు భగవద్గుణగానము జేయలేదు. అది జేయనికవికి చిత్తశాంతి యెక్కడిదని పలికెనట. అంత వ్యాసుడు తన లోపమెరిగి భాగవతరచన మూలమున నోరార భగవద్గుణగానము జేసి యాత్మానందమందెనట.

శ్రీహర్షుడు పండితుడను గర్వమున మేనమామతో దుర్వాదముజేసి నోట పురు వులుబడగా నైషధరూపమున నలునికీర్తించి దోషవిముక్తుడయ్యెనట. ఇట్టి ఘటన లనేకమున్నవి. కనుక వాల్మీకిగూడ ఈ కోటిలోనివాడే. అతడొకనాడు తమసానదికి స్నానమునకువెళ్లి నీటిలో మొలబంటివరకు దిగి ఎదురుగానున్న చెట్టుపై ఆలుమగలైన రెండుకొంగలు ముచ్చటించుకొనుచుండ క్షణకాలము జూచుచు నిలుచుండెనట. అంతలో ఎక్కడినుండియో ఒకవ్యాధుడాజంటలో మగపిట్టను రివ్వుమని బాణముతోగొట్టగా అది నేలపైబడి విలవిలలాడుచుండగా ఆడుపిట్ట రోదించెనట. అంత ఆ కరుణాపూరిత దృశ్య మునకు మహర్షిహృదయము కరిగి ఆ వ్యాధుని గురించి ` 

మానిషాద ప్రతిష్టాంతమ గమ శాశ్వతీ సమాః

యత్కాంచ మిథునాదేక మనదీః కామమోహితమ్‌

అని పల్కెను. అంత ఆ పలుకులు ములుకులైతాకి బోయవాడచటనే పడి మరణిం చెను. అదిగని మహర్షి ఒక విచారమునకు మరియొక విచారము తోడుకాగా నామాట శాపమై, బోయవాడు జచ్చెనుగదా ! నాకీ పాపమెటుల తొలగునని ఆలోచించుచునిలు జేరెను.

సాధారణముగా మనుష్యుడు చచ్చినవానిని బ్రతికించలేడుగనుక బ్రతికినవానిని చంపరాదని ధర్మజ్ఞులుజెప్పదురు. ఆకారణమున వాల్మీకి వ్యాధమరణమునకు చింతిల్లు చుండ నారదుడేతించి యతనికి రామకథను వ్రాయమని దానిచే ఆ దోషము తొలగునని యానతిచ్చెను. అంత వాల్మీకి రామాయణమును రచించి తనదోషమును పోగొట్టుకొనెను. ఇది రామాయణావతారిక.

వాల్మీకి శ్రీరాముని ఎన్నిక :

వ్యాధమరణదోషమున చింతాకులితుడైన వాల్మీకికి నారదుడు కనిపించి రాముని చరితమును రచింపుమనిచెప్పిన జెప్పుగాక ! వాల్మీకి క్రాంతదర్శిగదా ! తన కావ్యమునకు నాయకులు తగినవారెందరు  లేకుండిరి. అతడు శ్రీరామునే ఏలయెన్నుకొనెను? అను ప్రశ్నకు వాల్మీకి యే సమాధానము జెప్పలేదుగాని, యనంతరీయులైన మురారి, జయ దేవులిట్లు జెప్పిరి.

తొంటి బుధాలి రామువిభు తోరముగా నుతియించెనంచు దా

మంటక మానినన్‌ జగతినట్టి గుణోజ్వలుడొక నాయకుం

ఘంటఘటిల్లు నే కవులకొప్పగు వాగ్విభవంబు దల్పనే

వెంట భజించు ధన్వతను వీరు కృతార్థతగాంచుటెట్లోకో 

                                          `మురారి యనర్ఘరాఘవము. 

తమతమ సూక్తిపాత్రముగా దాశరథిన్నుతియించిరంచు నా

విమల మనస్కులైన కవివీరులు నింద్యులే యా రఘుర్వహో 

త్తము గుణబృంద దోషమని తద్దయు బల్కబోలుగానిని

నిస్వముడని రాముజేరి గుణసంతతువెల్ల వసించి నెక్కచో

జయదేవుని ప్రసన్నరాఘవము :

నిజమునకు పదులకొలది రామాయణములు పుట్టుట కవులదోషముగాదు. అతనిని విడిచిన మరియొకడట్టి పూర్ణపురుషుడు  కనిపించడు. కనుక కవితాపరిపాకము పొందిన ప్రతికవి ఏదో ఒకవిధముగా నేటికిని శ్రీరాముని కీర్తించుచునేయున్నాడు. కనుక క్రాంతదర్శిjైున ఆనాటి వాల్మీకికిగూడ యీ ప్రశ్న ఉదయించినపుడు నారదుడు చెప్పిన శ్రీరాముడుతప్ప మరియొక పూర్ణపురుషుడు గనుపింపకుండును. ఆ కారణముననే అతడు మారుమాటలేకుండా నారదుని వచనమంగీకరించి శ్రీరామునిచరితమును రచించెను.

ఉత్తమమైన క్షత్రియుడు తనచేతనున్న అస్త్రముద్వారా దుష్టునిశిక్షించి శిష్టుని రక్షించును. కనుక తపస్సుచే వాక్సిద్ధిపొందిన వాల్మీకిగూడ తన వాణిద్వారా నిర్వహించిన పాత్రయట్టిదేయని చెప్పవలయును. మొదట శాపరూపమైన తన వాక్కుద్వారా దుష్టుడైన కిరాతుడు మరణించునట్లు శపించెను. పిమ్మట అమృతమయమైన కవితద్వారా దశర థునిపుత్రుడైన శ్రీరాముని చిరకాలము జీవించునట్లుజేసెను. ఇటు, ఒకనిని జంపినందు లకు మరియొకనిని అమరునిజేసి తన దోషముబాపుకొనెను.

శ్రీరాముని గుణగణాలు : 

 వ్యాధుని చేష్టజూడగానే వాల్మీకికి కలిగిన సందేహంవలన మనకు శ్రీరాము డెట్టివాడో సృష్టముగా దెలియును. వ్యాధుడు చెట్టుపై ఆనందమనుభవించుచున్న పక్షుల జంటలో నొకదానిని బాణముతోగొట్టెను. నేడు మనము వీథిóప్రక్కన ముడుచుకొని సుఖముగా పండినకుక్కపై  రాయివిసిరిన పిల్లవానిని దాని ఆర్తనాదంవిని’ ఏమీరా ! అది నీకేం చేసింది’ అని మందలింతుము. సామాన్యులమైన మనస్థితియే ఇట్లుండ సర్వభూత సమదర్శిjైు ప్రాణుల సుఖదుఃఖము లన్నిటిని ప్రజ్ఞాచక్షువుచేనెరిగెడి మహర్షినడుగవ లెనా ! బోయవాని దెబ్బచే క్రిందబడి విలవిలలాడు పక్షినిజూచినపు డాయన హృదయమెంత తల్లడిల్లియుండును? అది ఎంతగా కదలిపోకున్నా దృశ్యమానజగత్తు నందంతటను తూష్ణీభావము వహించవలసిన యేని బోయవానినంత కఠినముగా మందలించును.

ఆయనకా వ్యాధుని జాడగానే లోకమింత కిరాతకమా ! అయిననిక సాధుజీవులకు మనుగడయెక్కడ ! అను సందేహంగలిగి తనకు దర్శనమిచ్చిన నారదునితో ` 

ఈ జగంబున నిప్పుడెవ్వడు గుణశాలి 

వీర్యవంతుడు ధర్మవేదియెవడు 

సూనృత వాక్యుండు సుకృతజ్ఞుడెవ్వడు 

సుచరిత్రుడు ధృఢవ్రతుడెవడు 

ఆత్మవంతుడు కోపమణచువాడెవ్వడు

ద్యుతిమంతు డీర్ష్యాదిదూరుడెవడు 

సర్వభూతహితుండు సర్వజ్ఞుడెవడు

దక్షుడెవ్వడు దుష్టశిక్షకుడెవడు

ఎవనియలుకకు నవనిలోన దివిజులైన 

మొనకునిలువంగ వెఱతురు మునివరేణ్య 

అతని విభవంబువిన మాకు కుతుకమొదవె 

ఎఱిగియుంటిరె నీవట్టి పురుషవర్య !

అనియడిగెను. లోకమున నొకతుంటరిపిల్లని దుశ్చేష్టజూచినపుడొక సాధు బాలకుడుగూడ స్పురించుట లోకధర్మము. లోకసహజమైన ఈ ష్థితియే వాల్మీకికి కలిగి త్రిలోకసంచారిjైుౖన నారదునట్టి పురుషుడెవరని యడిగెను. లోకసహజమైన యీ స్థితియే వాల్మీకి యలౌకికకార్యమునకు నాందిjైునది.

అతడు నారదునడిగిన లక్షణములనుబట్టిచూడ యా మహర్షి చిత్రించిన రాముడు  గుణశీలి, వీర్యవంతుడు, ధర్మవేది, సుకృతుడు, సుకృతజ్ఞుడు, సుచరిత్రుడు, దృఢవ్రతుడు, ఆత్మవంతుడు, కోపనిగ్రహుడు, ద్యుతిమంతుడు, ఈర్ష్యారహితుడు, సర్వభూతహితుడు, సర్వజ్ఞుడు, దక్షుడు, దుష్టశిష్టకుడు, ఎదురులేని మొనగాడు 

ఇటులతడు షోడశకళాపూర్ణుడు,

గుణశాలి, తండ్రిమాట జవదాటకుండుట

వీర్యవంతుడు సప్తతాళఛేదము

ధర్మవేది ` శివధనుర్భంగము

సుకృతుడు ` విభీషణునకులంకనిచ్చుటచే

సుకృతజ్ఞడు ` శబరికి సద్గతినిచ్చుట ` జటాయువు సంసారం 

సుచరిత్రుడు ` మారీచాదులచే పొగడబడుట

ధృడవ్రతుడు - భరతుడువేడినను అయోధ్యకువెళ్ళకుండుట.

ఆత్మవంతుడు 

కోపమణచువాడు ` కైకను దూషింపకుండుట

ద్యుతిమంతుడు ` అయోధ్యయందును అరణ్యమందేకరీతిగా నుండుట

ఈర్ష్యారహితుడు   ` భరతునికి రాజ్యమిచ్చుట

సర్వభూతహితుడు ` వానరసేవితుడగుట

దక్షుడు ` విశ్వామిత్ర మకరక్షణము.

ఇది శ్రీరాముని గుణశరీరము ఇక భౌతికశరీరమా

సమవిభక్తాంగుడు సజలాబ్దివర్ణుండు

లక్ష్మీయుతుడు భద్రిలక్షణుండు 

ఆయుతాబ్జదళాక్షు డతిపీనవక్షుండు 

అని ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం అని కీర్తింపబడినవాడు. అతని దివ్యసౌందర్యము వర్ణించుటకు రామాయణమున వాల్మీకి ఒకకాండనే ప్రత్యేకించినాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి