మొత్తం పేజీ వీక్షణలు

11, ఆగస్టు 2025, సోమవారం

ప్రముఖ సంగీత విద్వాంసులు ఈలపాట రఘురామయ్య

ప్రముఖ సంగీత విద్వాంసులు ఈలపాట రఘురామయ్యగారు గతించినా వారి ఈలపాటకు తిరుగులేదు. వారి కీర్తికోటకు తరుగు రాదు. పద్మశ్రీ కీ॥ శే॥ ఈలపాట రఘరామయ్యగారు తెలుగు నాటక రంగంలో మరుపురాని మనీషి..

రఘురామయ్య గుంటూరు జిల్లా సుద్దపల్లి లో జన్మించాడు.  ఈయన తలిదండ్రులు కళ్యాణం నరసింహ రావు, కళ్యాణం వేంకట సుబ్బమ్మ దంపతులు. 

2018లో ఈలపాట రఘరామయ్యగారి జీవిత గ్రంథాన్ని ప్రమఖ గాయకులు కీ॥ శే॥ S.P. బాలసుబ్రహ్మణ్యం గారు అవిష్కరించడం జరిగింది. బాలుగారిని ఈ గ్రంథ ఆవిష్కరణకి ముఖ్య అతిథి పిలవడానికి ఒక ముఖ్య కారణం ఉంది. శ్రీ బాలుగారు తమ సినీరంగప్రవేశం శ్రీశ్రీశ్రీ  మర్యాద రామన్న చిత్రంలో "ఏమి - ఈ వింత మోహం' తో ప్రారంభించారు. ఈ పాటకి ఉన్న విశేషం ఏమిటంటే - ఈ పాటను  పి. సుశీల, శ్రీ.పి బి.శ్రీనివాస్, శ్రీ బాలుగారు, రఘరామయ్య పాడటం జరిగింది.

రఘురామయ్య గారు రికార్డింగ్ కి వచ్చినపుడు బాలుగారే ఆ పాట ట్యూన్ వినిపించారు. రఘురామయ్య పాడిన అనంతరం బాలుగారు పాడారు. బాలుగారు పాడిన రీతిని చూసిన రఘురామయ్య - బాలుగారిని పిలిచి - ఆలింగనం చేసుకుని, ''చాలా చక్కగా పాడావు - నీకు ఘంట సాల గారంత భవిష్యత్తు ఉంది" అని దీవించారు. ఈమాటలు శ్రీ s. p. బాలు గారు దూరదర్శన్ కోసం ఇచ్చిన ఇంటర్వూలోనూ, ఈ గ్రంథావిష్కరణ సభలోనూ చెప్పారు.

ఆరోజు నుండి, బాలుగారికి రఘురామయ్య మీద ఎనలేని గౌరవం. అందుకే వారు ప్రతిసారి తమ రంగప్రవేశం ప్రస్తావన వచ్చినప్పుడల్లా ''నా మొదటి పాట రఘురామయ్యగారితో పాడాను" అని గర్వంగా చెబుతుండేవారు. 

బాలుగారు ఒక సభలో ఓ మాట  చెప్పారు " మర్యాద రామన్న - నామొదటి చిత్రమైతే రఘురామయ్యగారి చివరి చిత్ర మైంది'' అన్నారు. ఇది చాలా అరుదైన, గమ్మత్తైన విషయం. ఎంతో అద్భుతంగా ఈలపాట రఘురామయ్య గ్రంథాన్ని రచించిన గ్రంథకర్త శ్రీ. డా.  మొదలి నాగభూషణశర్మ గారు కొద్దిరోజుల ముందు స్వర్గస్తులయ్యారు.

ఈలపాట రఘురామయ్యగా ప్రఖ్యాతిచెందిన కల్యాణం వెంకట సుబ్బయ్య సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు.  స్త్రీ, పురుష పాత్రలు రెండూ ధరించారు. 

పద్మశ్రీ ఈలపాటి రఘురామయ్య 8వ ఏట నుంచే నాటకరంగ ప్రవేశం చేశారు. సుమారు 45వేల నాటకాలు ప్రదర్శించాడు.  ఈయన తెలుగు సినిమా రంగంలోనే మొట్టమొదటి కృష్ణుడిగా నిలిచారు. 

రఘురామయ్యగారు ఈల వేస్తూ పద్యాలను, పాటలను పాడటం మూ లానా ఈయన "ఈలపాట రఘురామయ్య"గా పేరు పొందారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈయనకు "నాటక కూయిల" అని కీర్తించారు.  కాశీనాథుని నాగేశ్వరరావు ఈయనకు రఘురామయ్య అని పేరు పెట్టారు.

రఘురామయ్య 1933 లో "పృథ్వీ పుత్ర" సినిమా ద్వారా తెలుగు చలనచిత్రంగంలోనికి ప్రవేశించారు.  రఘురామయ్య రమారమి 100 కు పైగా చలన చిత్రాలలో నటించారు.

రఘురామయ్య సతీమణి సావిత్రి. వీరి వివాహం బాపట్లలో 1938 లో జరిగింది. వారి సంతానం ఏకైక కుమార్తె సత్యవతి. 

వివి గిరి, నెహ్రూ, ఇందిరాగాంధీ, రబీంద్రనాథ్ టాగూర్, సర్వేపల్లి రాధాకృష్ణన్‌, శివాజీగణేషన్, ఎం.జి.రామచంద్రన్, పి.సుశీల, ఎస్.జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మమణ్యంలు ఈయన కళాచాతుర్యాన్ని మెచ్చుకున్న ప్రముఖులు 

రఘురామయ్య కాంస్య విగ్రహాన్ని ఆయన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో ఆవిష్కరించారు. ఈయన తన 75వ ఏట 1975, ఫిబ్రవరి 24 న గుండెపోటుతో మరణించాడు.






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి