మొత్తం పేజీ వీక్షణలు

1, ఆగస్టు 2025, శుక్రవారం

తీగలపల్లి వీరభద్రాలయము చారిత్రక విశేషాలు

 తీగలపల్లి వీరభద్రాలయము చారిత్రక విశేషాలు 

తీగలపల్లె అనే గ్రామం ఉమామహేశ్వరంలోని కరణం రామయ్యగారి శాసనంలో పేర్కొనబడింది. తీగలపల్లె వెనుక ఒక మర్తురు నీరు నేల ఉమామహేశ్వరునికి అతడిచ్చినట్లు దానిలో వుంది. ఈ శాసనం క్రీ. శ. 1280 నాటిది. 

ప్రస్తుతం ఈగ్రామం నాగర్‌ కర్నూలు నుండి కొల్లాపురం వెళ్లే సర్వీసు దారిలో కోడేరు లైను పై ఉంది. రోడ్డుకు రెండు కిలోమీటర్లదూరం ఉంటుంది, ఇది కొల్లాపురం తాలూకాకు చెందిన ప్రాచీన గ్రామాలలో ఒకటి కాని ఉమామహేశ్యర శాసనం నాటి ఊరు ఇప్పుడుండేది కాకపోవచ్చు. 

నాగల్‌ కర్నూలు తాలూకాలోని గుడిపల్లె నుండి నాగపూర్‌ ` రావిపాకుల రేవల్లే- తీగలపల్లె జనుంపల్లె మొదలైన గ్రామాల మీదుగా కొల్లాపురం తాలూకాలోని కృష్ణాతీరం వరకు ఒక గుట్టలు వరుస వ్యాపించింది. దాన్ని ఈ గ్రామం దగ్గర ఆ పేర పిలుస్తారు. ప్రస్తుతం తీగలపల్లె దగ్గర ఈ గుట్ట ఊరికి తూర్పుగా ఒక పరువుడూరంలో ఉంది. దీని పైకి ఎనుబది మెట్లున్నవి. 

ఒకనాడీకుడిగుట్ట సైనికవాసంగా ఉండేది . దానిపై సుమారు మూడెకరాల చదరపు స్థలముంది. దాని చుట్టు ప్రాకారంవంటి కోట ఉంది. దానిలో సైనికులుండేవారట. ఈ గుట్టల వెంటగల గుడిపల్లె` నాగపూరు` రేవల్లె ప్రాచీన గ్రామాలు. పశ్చిమ చాళుక్యుల సామంతుల శాసనాలున్నవి కాబట్టి ఆనాడెవరిదో ఒకరి సైన్యం దీనిపై నివసించవచ్చు. ఆ నాటి గ్రామం ఈ గుట్టల క్రిందనే ఉండేది. ప్రస్తుతం పర్వతం నీడ తనపై పడగూడదని అలా దూరం వెళ్లిపోయిందిగాని ఆనాటి మహిషమర్ధని, హనుమదాలయాల అవశేషాలిక్కడనే ఉన్నవి. 

మహిషమర్ధని శిల్పంలో అసురుని రూపం ఇక్కడ నాలుగు విధాలుగా కనిపిస్తుంది. ఇంద్రకల్లులోని ఆతని రూపం పూర్వకాయం నరుడుగా, ఉత్త రకాయం మహిషంగా, రాయగిరి కేవలం శిరస్సు మాత్రమే మహిషంగా, కందూరిలో మహిష చిహ్నంగా మానవ శిరస్సుకే మహిష శృంగాలుగా ఉంటాయి. కుండలపై ఉబ్బెత్తుగా కనిపించే మహి షునిపై నుండి మానవాకారుడైన మహిషుడు మలచ ఇది ఇక్కడి శిల్పులలో వచ్చిన భావ పరిణామానికి ఒక గుర్తు. 

మనుషుల మాదిరే గ్రామాలకు గూడ పునర్జన్మలున్నవి. ఒక్కొక్క ఊరు ఎన్నెన్నో జన్మలెత్తింది ఈ గ్రామం మొదటి స్థలం విడిచిన పిమ్మట రెండవ తడవ బసవన్నమిట్ట దగ్గర మూడవసారి లింగమయ్య గడ్డ ప్రక్క’ కొంతకొంతకాలం కాపురం చేసి నాలుగవదిగా ఇపుడున్నచోట నిలిచినట్టు గ్రామస్తులు చెబుతారు. ఈ ప్రాంతంలో చాళుక్య శాస నాలు క్రీ.శ. 1133 నుండి 1249 వరకు కనిపిస్తవి కాబట్టీ ఊరు ఎవరెవరికాలంలో ఎక్కడ ఉన్నది కచ్చితంగా తెలియదు. 

ఇక్కడి గుట్టపై ఉత్తరాభిముఖంగా ఒక గుండు దరివలె సాగింది. దీన్ని గర్భంగా చేసికొని యిక్కడి ఆలయనిర్మాణం జరిగింది, గుండు క్రింది స్థలాన్ని రెండు సమానమైన గదులుగా విభజించి మొదటి దీనిలో వీరభద్రుని దానికి ఎడమ వైపు దానిలో భద్రకాళిని ప్రతిష్ఠించినారు. 

వీరభద్రునికి కుడి వైపున గణపతున్నాడు ఆతనికి ఆలయానికి స్థలంచాలలేదు. గర్భాలయాలకు సమానంగా కొంచెం ముందుకు అరుగు వేసి దాని పై ప్రతిష్ఠించినారు. 

భద్రకాళికి ఎడమ వైపున పూర్వాభిముఖంగా మరోగది వేసి దానిలో శివలింగాన్ని ప్రతిష్టించినారు. ఈ పానవటం గుండ్రంగా గాక చదరంగా ఉంది. దాని పై గల కాణం నిద్దంగా నిగ నిగ లాడుతుంది. ఈ శివునికి మందు వైపున ఈశాన్యంగా దేవీమూర్తి ఉంది. అమె తనచేతిలో పద్మషండం ధరించింది. 

ఈ ఆలయాలన్నిటికి కలిపి ముందు మంటపం ఉంది. దీనిలో వీరభద్రుని కెదురుగా చిన్ననంది, శివుని కెదురుగా పెద్దనంది ఉన్నవి. ఇక్కడి శిల్పాలన్ని కృష్ణ శిలానిర్మితాలు, నందులలో కాకతీయుల నాటికళ తొణికిసలాడుతుంది. 

ఆలయానికి పడమరవైపు మరియు ముందు గుట్టపై కొంక క్రిందినుంచి రాయిగట్టితిద్ధినింపి చదునుజేసి చిన్న ప్ర్రాకారం గట్టి ఆవరణలోద్వజ స్తంభం నిలిపినారు. 

వీరభద్రుడు సైనికుల దైవం. కాకతీయుల కాలంలో వీరోచిత మైనసాహసకృత్యాలతో గూడిన వీరభద్రోత్సవాలు, మైలార దేవర ఉత్సవాలు ఎక్కు వగా జరిగేవి కాబట్టి ఆకాలంలోనే ఈ స్వామిని యిక్కడ ఉండే సైనికుల కొరకు ప్రతిష్ఠించి ఉటారు ఈ స్వామిని గద్వాల వైశ్యులు ప్రతిష్టించిరట. కాని వారెవరో తెలియలేదు. 

ప్రస్తుతం ఉండే తీగలపల్లిని ‘‘తీగన్న’’ అను గొల్లవాడు స్థాపించెనట. ఇపుడీ గ్రామంలో గొల్ల వారెక్కువ. కురువ గొల్లలకు వీరన్న కులదైవం. వీరన్న వీరభద్రుడే. సంక్రాంతికి యిక్కడ వారీ దేవునికి గొప్పగా ఉత్సవం చేస్తారు. 

సంక్రాంతికే గాక శివరాత్రికి గూడ పెద్ద ఉత్సవం జరుగుతుంది. అపుడు తాండూరు, గుల్బర్గా కర్నూలు నుండి గూడ వీరశైవు లిక్కడికి వస్తారు. రాత్రిఅంతా భజనలు, కోలాటం, నందికోలనృత్యం ఖడ్గాలు చదువటం మహావైభవంగా జరుగుతవి. 

ఈ గ్రామానికి సమీపంలో గల జనుంపల్లి గుట్టపై మంకాలమ్మ దేవత ఉంది. ఆదేవత దగ్గర సిడి తిరిగే ఆచారం యిప్పటికి నడుస్తుంది. పూర్వం పిడికి మనిషినే కట్టిత్రిప్పేవారట కాని యిపుడు మనిషిని ఒక చుట్టుత్రిప్పి అతనిని దించి తరువాత గొఱ్ఱెపోతు నెక్కిస్తారట. ఈ ఉత్సవం తీగలపల్లి జాతర ముగియంగానే జరుగుతుంది. 

ఈ స్వామి మహిమలు గూడ ప్రజలలో చాలా ప్రచారంలో ఉన్నవి. దైవమన్నపుడు ఏవో కొన్ని మహిమలుండవలె. అర్జనుడంత వానికి శ్రీ కృష్ణుడు విశ్వరూపం చూపినంతవరకు అతని మీద విశ్వాసం కుదరలేదు గనుక యిదీ ఇంతే. ఈనాడు దైవం తననుతాను నిరూపించుకోలేకపోతె అడిగే వారుండరు. 

ఒకప్పుడు ఈ గ్రామంలో రామయ్య అనే తంబళి పూజారి ఉన్నాడు. అతడు  ప్రతిదినం ఆలయానికి పూజకు వెళుతుంటే అతని వెంట ఆయన కుమారుడు కూడ వెళ్ళేవాడు. అతడు నాలుగైదేం డ్లవాడు. ఒకనాడు తండ్రి వెంట మాములుగా గుట్ట పైకి వెళ్లినాడు. తండ్రి పూజ ముగిసే వరకు కనిపించలేదు. ఆయన పిల్లవాడు యింటికి వెళ్లి ఉండవచ్చు నని మాములుగ యింటికి వెళ్లినాడు. బాలుడు రాలేదు. 

మూడుదినాలు యిక వారు పిల్లవాని కొరకు వెదకినారు కనిపించలేదు. నాలుగవనాడు రామయ్య దినం వలె దేవుని పూజించి వెలుపలికి వచ్చేవరకు బాలుడు అక్కడే నిలుచొని ఉన్నాడు. అతనిని చూడగానే ఆశ్చర్యం వేసి ‘ఏమిరా ఎక్కడవెళ్లినావు’ అంటే ‘నన్ను ఒక తాశయ్య వచ్చి తీసుకు వెళ్లినాడు నాన్నా మళ్ళీ ఆయనే యిపుడు నన్ను ఇక్కడదించి వెళ్లినాడు’’ అని చెప్పినాడు. ఈ బాలుని వంశం ఇపుడుంది. 

తీగలపల్లిలో గతశతాబ్దంలో ‘‘బూశన్న’’ అనే ఒక బోయ పిల్లవాడు న్నాడు. అతడు పశువుల కాపరి. వీరన్న గుట్టచుట్టే తన పశువులను మేపు కొనేవాడు. ఆకాలంలో దీనిచుట్టు ఆముదంచేలెక్కువ. ఒకనాడతడు పశువులను మాములుగా తోలుకొని వెళ్లి పోలంలో విడిచి తానుఆటలో పడినాడు. అట ముగిసి చూచుకునే వరకు అవి ఆముదం చేలలో పడి బాగా మేసి నాముగొని పడినవి. ఆ ఆవులిక చచ్చినవని వాని యజమానులు తనను బ్రతుకు నీయరనే భయంతో బూశన్న ఏడుస్తు కూచున్నాడు. గుట్ట క్రింద ప్రాత ఆలయానికి కొంతదూరంలో ఒక కోనేరుంది. కాసేపటికి తలెత్తిన బూశన్నకు కోనేటి దగ్గర ఎవరో ఒక సాధువు నిలచి తనను పిలుస్తున్నట్టు తోచింది. అతడు లేచి అక్కడికి వెళ్లినాడు.

ఆ సాధువు అతనికి తన కమండలం యిచ్చి దీనిలోని నీరు ఆవులపై చల్లు మన్నాడు. అతడు అది తెచ్చి వానిపై చల్లగా కొన్ని క్షణాలలోనే అవి మళ్లీ మామూలుగా లేచినవి. బూశన్న సంతోషతో కమండలం మళ్లీ ఆ సాధువు కిచ్చేందుకు కోనేరు దగ్గరకు వెళ్లినాడు. అతని కక్కడ ఎంత సేపు చూసినా సాధువు కనిపించలేదు. కమండలం అక్కడ పెట్టి పశువులను గ్రామంలోనికి తోలుకొని వచ్చి జరిగిన సంగతిచెప్పినాడు. అది విని గ్రామవాసులాశ్చర్యపడి ఆయన దర్శనంకోసం భజనతో వెళ్ళినారు. వారువెళ్లేవరకు కూడ వారికి కమండలంగూడ కనిపించలేదు. 

బూశన్నకు ఈ ఘటన పిమ్మట జీవితంలో పెద్దమార్పు వచ్చింది. అబద్దం చెప్పటం మాని నారాయణ స్మరణ ప్రవృత్తుడైనాడు. అపుడపుడు కొందరికి భవిష్యత్తుగూడా చెప్పేవాడు. అకనినోటి వెంట నారాయణా అనే మకుటంలో ద్విపదవంటి పాదాలు వచ్చేవి. అవి అతని సొంతం. ఋశన్న ముసలివాడైనంతవరకు బ్రతికినాడు. అతన్ని చూసి అతనిపాటను విన్నవారు ఇటీవలివర కుండేవారు. 

ఇక్కడి వీరభద్రుని గుడి ఉత్సవం ముందు ఏటా ఒకతెలుగు జాతికిచెందిన అవ్వ అలికి ముగ్గులు వేసేది. ఒకప్పుడామె ఆవిధంగా గుడికి సున్నంవేసి అలికి’’ ‘ఈ నల్లనిసామికి ఇంతకంటేబాగానా ‘‘అను కుంటు మెట్లు దిగటానికి వచ్చింది. ఆమె మొదటి మెట్టు పై కాలు పెట్టగానే ఒక తెల్లని త్రాచు బస్సుమని లేచి ముఖానికేసి కొట్టింది. ఆమె చచ్చినాను రోయి అని కేకవేసి పడిపోయింది. అక్కడ పశువులు మేపుతున్నవారు పరుగెత్తుకొనివచ్చి ఆమెను లేవదీసి ఏంజరిగిందని అడిగినారు, ఆమె నేను మెట్లు దిగుతుండగా ఒక పెద్దపాము పడగవిచ్చి నా పైకి లేచి ముఖాన్ని కొట్టింది అని చెప్పింది. వారామెకు ధైర్యం చెప్పి కూచోబెట్టినారు. కాని దానితో ఆమెకు దృష్టి పోయింది. నాకు కన్నులు కనిపించటంలేదని ఆమె ఏడవసాగింది. అపుడు వారు స్వామి మహిమనే యివి మరొకటి కాదని ఆమెను తీసుకొనివెళ్లి స్వామి మందు సాష్టాంగపడవేసి నీవేమితప్పుగా తలచినావో క్షమాపణ చెప్పుకొమ్మన్నారు. ఆమె చెప్పుకొన్నది. దానితో ఆమెకు మళ్ళీ దృష్టి వచ్చింది. 

ఇటువంటి ఉదంతా లీస్వామినిగురించి ఎన్నో ఉన్నవి. ప్రస్తుతం గుట్టక్రింద పాతÄగుడికి దక్షణం కొంత దూరంలో కోనేరుంది. అది త్రవ్వినపుడు గూడ- రెండుమూడు చోట్ల ఎక్కడ ప్రయత్నించినా బావి పడలేదట. అపుడు దానిని త్రవ్వించిన అతనికి కలలో కనిపించి తానే ఆ స్థలం చూపినాడట. 

గత పరీధావి సంవత్సరంలో గ్రామస్థులక్కడ పెద్ద సప్తాహం చేసినారు. ఆసమయంలో అన్నం పెట్టటానికి మేం వెనుదీయలేదు గాని స్వామివారు నీళ్లి వ్వలేక పోయినాడంటారు. ఇప్పటికి యిక్కడ ఏదైనా పెద్ద కార్యక్రమం తలపెట్టాలంటే గ్రామస్థులు ముఖ్యంగా నీటివసతికి భయపడుతారు. 

ఈ గుట్టకింద ‘‘మూలనాగయ్య’’ అనేవ్యక్తి పొలంఉంది. అతడు చేల కాలంలో కాపలా పడుకుంటే ఈ గుట్టపై ఏదో వెలుగు సంచరిస్తున్నట్టు  కనిపించేదట. దేవతలంటే ప్రకాశస్వరూపులు గదా! వారా విధంగా తేజోరూపంతో సంచరించటం మన పురాణేతిహాసాలకు కొత్తగాదు. అందుచేత అతడు ఒక పర్యాయం రాత్రివేళలో సంచరించే ఆ వెలుగుకు కారణమేమిటా అని ఒక పర్యాయం గుట్టపై ఆసాంతం పరిశీలనగా చూడగా అతనికిక్కడ ఒక శిల కని పించింది.’’ అది యించుమించు మానవ ముఖాకృతిగా ఉంది. అది అతనికి మరొక దరిక్రింద కనిపించింది. ఆ దరి గూడా చిన్న గుడివలెనే ఉంది. దానిలో ఆనాటి నుండి అతడక్కడ చెన్న కేశవుని నిలుపుకొన్నాడు. ఇపుడు గ్రామస్థులా దేవునిగూడ పూజిస్తున్నారు. ఈ స్వామికి యింకా గుడిమొదలైనవి ఎర్పడలేదు, ఊరివారా ప్రయత్నం చేయవలసి ఉంది. 

వీరభద్రాలయాన్ని మాత్రం స్థానికుడైన కరణం, అన్నమరాజు రామచంద్రరావు గారు భక్తి శ్రద్దలతో చూస్తూ ఏటేటా ఉత్సవం నడిపిస్తున్నారు. వీరభద్రాలయం బుట్టిది ఈ ప్రాంతంలో మరొకటి లేదు కాబట్టి యిది తప్పకుండా ఉద్దరించవలసిన క్షేత్రాలలో ఒకటి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి