మొత్తం పేజీ వీక్షణలు

15, మే 2022, ఆదివారం

sri bagavadgeetha - krishna preechings to arjuna- daivadura sampadwibhaga yogam

 ఓం శ్రీ పరమాత్మనే నమః

అథ షోడశో2ధ్యాయః

దైవాసుర సంపద్విభాగ యోగః

శ్రీ భగవాన్‌ ఉవాచ

అభయం సత్త్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః

దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తవ ఆర్జవమ్‌ 1

శ్రీ భగవానుడు పలికెను - నిర్భయత్వము, అంతఃకరణశుద్ధి, తత్త్వజ్ఞాన ప్రాప్తికై ధ్యాన యోగము నందు నిరంతర దృఢస్థితి, సాత్వికదానము, ఇంద్రియ నిగ్రహము, భగవంతుని, దేవతలను, గురుజనులను పూజించుట, అట్లే అగ్నిహోత్రాది - ఉత్తమ కర్మాచరణము, వేద శాస్త్రముల పఠన, పాఠనములు మరియు భగవంతుని నామగుణ కీర్తనములు, స్వధర్మాచరణము నందలి కష్టములకు ఓర్చుకొనుట, శరీరేంద్రియాంతః కరణముల సరళత్వము (ఆర్జవము) (1)

అహింసా సత్యమక్రోధఃత్యాగః శాంతిరపైశునమ్‌

దయాభూతేష్వలోలుప్త్వం మార్దవంహ్రీరచాపలమ్‌ 2

అహింస (మనోవాక్కాయముల ద్వారా ఎవ్వరికిని ఏ విధముగను కష్టమును కల్గింపకుండుట), సత్యము (యధార్థమైన, ప్రియమైన భాషణము), అక్రోధము (తనకు అపకారము చేయువారిపైన కూడ కోపము లేకుండుట), త్యాగము (కర్మాచరణము నందు కర్త ృత్వాభిమానమును త్యజించుట), శాంతి (చిత్తచాంచల్యము లేకుండుట) ఆపైశునము (ఎవరినీ నిందింపకుండుట), దయ (అన్ని ప్రాణుల యెడ నిర్హేతుక కృప), అలోలుప్త్యము (ఇంద్రియ విషయ సంయోగము ఉన్నను వాటిపై ఆసక్తి లేకుండుట), మార్దవము (కోమలత్వము), శాస్త్రవిరుద్ధ కార్యాచరణమునకు వెనుకాడుట (సిగ్గుపడుట), అచాపలము (వ్యర్థ చేష్టలు చేయకుండుట). (2)

తేజఃక్షమా ధృతిఃశౌచమ్‌ అద్రోహోనాతిమానితా

భవంతి సంపదం దైవీమ్‌ అభిజాతస్యభారత 3

ఓ అర్జునా! తేజస్సు క్షమ, ధైర్యము, శౌచము (బాహ్యశుద్ధి) అద్రోహము (ఎవ్వరిపైనను శత్రుభావము లేకుండుట) అమానిత్వము (తాను పూజ్యడనను అభిమానము లేకుండుట) మొదలగునవి యన్నియును దైవీసంపద గలవాని లక్షణములు. (3)

దంభోదర్పో2భిమానశ్చక్రోధఃపారుష్యమేవ చ

అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీమ్‌ 4.

ఓ పార్థా! దంభము (కపటము), దర్పము (మొండితనము), అభిమానము, క్రోధము, పారుప్యము (మాటల యందును, చేష్టల యందును కఠినత్వము), అజ్ఞానము మొదలగునవి ఆసురీ స్వభావము గలవాని లక్షణములు. (4)

దైవీసంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా

మా శుచః సంపదం దైవీమ్‌ అభిజాతో2సి పాండవ 5

ఓ అర్జునా! దైవీ సంపద ముక్తి దాయకము, ఆసురీ సంపద బంధ హేతువు. నీవు దైవీసంపదతో పుట్టినవాడవు. కనుక శోకింపకుము. (5)

దౌభూతసర్గౌె లోకే2 స్మిన్‌ దైవ ఆసుర ఏవ చ

దైవో విస్తరశఃప్రోక్తః ఆసురంపార్థమే శృణు 6

ఓ అర్జునా! ఈ లోకమున నున్న మానవులు రెండు విధములుగా ఉందురు. దైవ లక్షణములు గలవారు కొందరు. ఆసుర లక్షణములు గలవారు మరికొందరు. దైవ లక్షణములు విస్త ృతముగా తెల్పబడినవి. ఇప్పుడు ఆసుర లక్షణములు గలవారిని గూర్చి వివరముగా తెల్పెదను వినుము. (6)

ప్రవృత్తిం చ నివృత్తించ జనా న విదురాసురాః

నశౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే 7

ఆసుర స్వభావము గలవారు ప్రవృత్తినివృత్తులను (కర్తవ్యాకర్తవ్యములను) ఎరుగరు. కనుక వారిలో బాహ్యాభ్యంతర శుచిత్వము గాని, శ్రేష్ఠమైన గాని, ప్రవర్తన గాని, సత్యభాషణము గాని ఉండనే ఉండవు. (7)

అసత్యమప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్‌

అపరస్పరసంభూతం కిమన్యత్‌ కామహైతుకమ్‌ 8

ఈ జగత్తునకు ఆధారమైనది ఏదియును లేదనియు, ఇది అసత్యమనియు, భగవంతుడనెడివాడు లేనేలేడనియు, కామప్రేరితులైన స్త్రీ పురుషుల సంయోగ కారణముగ జీవులు సహజముగనే పుట్టుచున్నారనియు, కావున స ృష్టికి కామము తప్ప మరొక కారణమే లేదనియు ఆసుర లక్షణములు గలవారు భావింతురు.

ఏతాం దృష్టిమవష్టభ్యనష్టాత్మానో2ల్పబుద్ధయః

ప్రభవంత్యుగ్రకర్మాణఃక్షయాయ జగతో2హితాః 9

అసంబద్ధమైన ఇట్టి మిధ్యావాదము చేయు భౌతిక వాదులు ఆత్మను గూర్చి తలంపరు. (ఆత్మ యొక్క అస్తిత్వమును విశ్వసింపరు) వారు మందబుద్ధులు. వారు అందరికిని అపకారము చేయు క్రూరులు. వారి శక్తి సామర్థ్యములు ప్రపంచ వినాశమునకే వినియోగపడుచుండును. (9)

కామమాశ్రిత్యదుష్పూరం దంభమానమదాన్వితాః

మోహాద్గృహీత్వా2 సద్గ్రాహాన్‌ ప్రవర్తంతే2 శుచివ్రతాః 10

దంభము, దురభిమానము, మదములతో గూడిన ఈ ఆసుర లక్షణములు గలవారు యుకాయుక్తములను మరచి, తమ వాంఛలను ఏదో విధముగ తీర్చుకొనుటకు సిద్ధపడుదురు. అజ్ఞానకారణముగ మిథ్యా సిద్ధాంతములను ఆశ్రయింతురు. శాస్త్రవిరుద్ధముగా భ్రష్టాచారులై ప్రవర్తింతురు. (10)

చింతామపరిమేయాంచప్రలయాంతాముపాశ్రితాః

కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాః 11

మరణించువరకును వారు అంతులేని చింతలలోనే మునిగిపోవుచుందురు. విషయభోగానుభవముల యందే తత్పరులై అదియే నిజమైన సుఖమని భావింతురు. (11)

ఆశాపాశశతైర్భద్దాఃకామక్రోధపరాయణాః

ఈ హంతేకామభోగార్థమ్‌ అన్యాయేనార్థ సంచయాన్‌ 12

వారు ఆశాపాశపరంపరలచే ఎల్లప్పడును బంధింపబడుచుందురు. కామక్రోధ పరాయణులై ప్రవర్తింతురు. విషయ భోగముల నిమిత్తమై, అన్యాయ మార్గముల ద్వారా ధనార్థనకు పాల్పడుచుందురు. (12)

ఇదమద్యమయా లబ్దమ్‌ ఇమం ప్రాప్స్యేమనోరథమ్‌

ఇదమస్తీదమపిమే భవిష్యతి పునర్ధనమ్‌ 13

‘‘నేను మిక్కిలి పురుషార్ధిని గనుక ఈ అభీష్ట వస్తువును పొందితిని. ఇంకను నా మనోరథములన్నింటిని సాధించుకొనగలను. ఇప్పటికే నాకడ ఎంతో ధనము ఉన్నది. మన్ముందు ఇంకను ఎంతో ధనమును సంపాదింపగలను’’ అని వారు తలంచు చుందురు. (13)

అసౌమయా హతః శత్రుఃహనిష్యే చాపరానపి

ఈశ్వరో2హమహంభోగీసిద్ధోహంబలవాన్‌ సుఖీ 14

నేను ఈ శత్రువును వధించితిని. ఇతర శత్రువులను కూడ వధింపగలను. నేనే సర్వాధిపతిని, సమస్తసుఖభోగములను అనుభవింపగలవాడను నేనే. సిద్దులన్నియు నా గుప్పిటనే యున్నవి. నేనే గొప్ప బలవంతుడను. (14)

ఆఢ్యో2భిజనవానస్మికో2న్యో2స్తి సదృశో మయా

యక్ష్యేదాస్యామి మోదిష్యఇత్యజ్ఞానవిమోహితాః 15

అనేక చిత్తవిభ్రాంతాః మోహజాలసమావృతాః

ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకే2శుచౌ 16

‘‘నేనే గొప్ప ధనవంతుడను, మిక్కిలి పరివారము గలవాడను. నాతో సమానుడు మరియొకడు లేడు. నేను యజ్ఞములను చేయగలను. దానములు ఇయ్యగలను. యథేచ్చముగా వినోదింపగలను. - అనుచు అనేక విధములుగా అజ్ఞాన మోహితులై చిత్త భ్రమణమునకు లోనై మోహజాలము నందు చిక్కుకొని, ఆసుర లక్షణములు గలవారు విషయ భోగముల యందే మిక్కిలి ఆసక్తులై ఘోర నరకముల యందు పడిపోవు చుందురు. (15-16)

ఆత్మసంభావితాః స్తబ్ధాధనమానమదాన్వితాః

యజంతే నామయజ్ఞైస్తే దంభేనావిధిపూర్వకమ్‌ 17

వారు తమకు తామే గొప్పవారమని భావించుకొనుచు, గర్వోన్మత్తులై, ధన దురహంకారములతో కన్ను మిన్ను గానక ప్రమత్తులై శాస్త్రవిరుద్ధముగా ఆడంబర ప్రధానముగా పేరుకు మాత్రమే యజ్ఞముల నాచరించుదురు. (17)

అహంకారం బలం దర్పం కామం క్రోధంచ సంశ్రితాః

మామాత్మపరదేహేషు ప్రద్విషంతో2భ్యసూయకాః 18

అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధములకు వశులై, ఇతరులను నిందించుచు తమ శరీరముల యందును ఇతరుల శరీరముల యందును, అంతర్యామిగా నున్న నన్ను ద్వేషించు చుందురు. (18)

తానహం ద్విషతః క్రూరాన్‌ సంసారేషునరాధమాన్‌ 

క్ష్షిపామ్యజస్రమశుభాన్‌ ఆసురీష్వేవ యోనిషు 19

అట్ల్లు ఇతరులను ద్వేషించు పాపాత్ములను, క్రూరులైన నరాధములను మాటిమాటికిని ఈ సంసారము నందు ఆసురీయోనులలోనే నేను పడవేయు చుందును. (19)

ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని

మామప్రాప్యైవ కౌంతేయతతో యాంత్యధమాంగతిమ్‌ 20

ఓ అర్జునా! ఈ ఆసురీ ప్రకృతి గల మూఢులు, నన్ను పొందకయే, ప్రతి జన్మ యందును ఆసురీయోనులనే పొందుచు చివరకు అంతకంటెను హీనమైన గతిని పొందుదురు. అనగా ఘోరమైన నరకముల యందు పడెదరు. (20)

త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః

కామఃక్రోధస్తథా లోభః తస్మాదేతత్త్రయం త్యజేత్‌ 21

కామక్రోధ లోభములు అను ఈ మూడును నరక ద్వారములు. అవి ఆత్మ నాశమునకు కారణములు. అనగా మనుజుని అధోగతి పాలు చేయునవి. కనుక ఈ మూడిరటిని త్యజింపవలెను. (21)

ఏతైర్విముక్తఃకౌంతేయతమోద్వారైత్రిభిర్నరః

ఆచరత్యాత్మనఃశ్రేయఃతతో యాతి పరాం గతిమ్‌ 22

ఓ అర్జునా! ఈ మూడు నరకద్వారముల నుండి బయటపడినవాడు శుభకర్మలనే ఆచరించును. అందువలన పరమగతిని పొందును. అనగా నన్నే పొందును. (22)

యఃశాస్త్రవిధిమత్సృజ్యవర్తతేకామకారతః

న స సిద్దిమవాప్నోతిన సుఖం న పరాం గతిమ్‌ 23

శాస్త్రవిధిని త్యజించి, యధేచ్చగా (విశృంఖలముగా) ప్రవర్తించువాడు సిద్ధిని పొందజాలడు. వానికి ఇహ పరలోక సుఖములు లభింపవు. పరమగతియు ప్రాప్తింపదు. (23)

తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ

జ్ఞాత్వాశాస్త్రవిధానోక్తం కర్మకర్తుమిహార్హసి 24

కర్తవ్యాకర్తవ్యములను నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణము. కనుక శాస్తోక్త కర్మలను గూర్చి బాగుగా తెలిసికొని, అట్టి కర్మలను ఆచరింపుము. (24)

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే

దైవాసుర సంపద్విభాగ యోగో నామ షోడశో2ధ్యాయః 16

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి