మొత్తం పేజీ వీక్షణలు

15, మే 2022, ఆదివారం

bagavadgeetha - udhbhoda- krishna preechings-bakthi slokas with meanings - shradhatraya vibhagayogam

 ఓం పరమాత్మనే నమః

అథ సప్తదశో2ధ్యాయః

శ్రద్ధాత్రయ విభాగయోగ

అర్జున ఉవాచ

యే శాస్త్రవిధిమత్సృజ్య యజంతే శ్రద్దయాన్వితాః

తేషాం నిష్ఠాతుకా కృష్ణసత్త్వమాహోరజస్తమః 1

అర్జునుడు పలికెను ` శ్రీ కృష్ణా! శాస్త్రవిధిని త్యజించి, భక్తి శ్రద్ధలతో యజ్ఞములను గాని, దైవ పూజలను గాని కొందరు చేయుచుందురు. వారి నిష్ట (వారి విధానము) సాత్త్వికమా? రాజసమా? తామసమా? (1)

శ్రీ భగవాన్‌ ఉవాచ

త్రివిధా భవతి శ్రద్దా దేహినాం సా స్వభావజా

సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు 2

శ్రీ భగవానుడు పలికెను - శాస్త్రోక్తముగా నుండక కేవలము స్వభావమును అనుసరించి ఏర్పడుచుండు మానవుల శ్రద్ధ సాత్త్వికము, రాజసము, తామసము అని మూడు విధములుగా ఉండును. వాటిని గూర్చి వివరించెదను. వినుము. (2)

సత్త్వానురూపా సర్వస్యశ్రద్ధా భవతి భారత

శ్రద్ధామయో2యం పురుషో యో యచ్ఛ్రద్దః స ఏవ 3

ఓ అర్జునా! మనుష్యులందరి శ్రద్దయు వారి అంతఃకరణ రీతులకు తగినట్లు ఉండును. ప్రతి వ్యక్తికి ఏదోఒక శ్రద్ద ఉండనే ఉండును. అతని జీవన విధాన మంతయును అతని శ్రద్దకు అనుగుణముగా కొనసాగు చుండును. దానిని బట్టి అతడెట్టి శ్రద్ద కలిగి యున్నదియు తెలిసికొనవచ్చును. (3)

యజంతేసాత్త్వికాదేవాన్యక్షరక్షాంసి రాజసాః

ప్రేతాన్‌ భూతగణాంశ్చాన్యేయజంతే తామసా జనాః 4

వారిలో సాత్వికులు దేవతలను, రాజసులు యక్ష రాక్షసులను, తామసులు ప్రేత భూత గణములను పూజించెదరు. (4)

అశాస్త్రవిహితంఘోరం తప్యంతే యే తపో జనాః

దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః 5

దంభము, అహంకారము గలవారు, కోరికలు ఆసక్తి కలిగియుండువారు, బలగర్వితులు ఐనవారు, శాస్త్రవిరుద్ధముగా మనః కల్పితమైన ఘోర తపస్సులను ఆచరించుచు. (5)

కర్శయంతః శరీరస్థం భూతద్రామమ చేతసః

మాం చైవాంతః శరీరస్థం తాన్‌ విద్ద్యాసురనిశ్చయాన్‌ 6

శరీరముల యందున్న జీవులను, మరియు అంతర్యామిగా అనగా పరమాత్ముడనైన నన్ను కృశింప జేయువారు అజ్ఞానులైన ఆసుర స్వభావము గలవారని యెరుంగుము. (6)

ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః

యజ్ఞస్తపస్తథాదానం తేషాం భేదమిమం శృణు 7

మనుష్యుల స్వభావములను అనుసరించి, వారికి ఇష్టములైన ఆహారములు గూడ మూడు విధములుగా ఉండును. అట్లే ఆయా మనుష్యులు ఆచరించు యజ్ఞములు, తపస్సులు, దానములు గూడా మూడేసి విధములుగానే ఉండును. వాటిని గూర్చి వేర్వేరుగా విశదపరచెదను వినుము. (7)

ఆయుఃసత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్థనాః !

రస్యాః స్నిగ్థాఃస్థిరా హృద్యా ఆహారాః సాత్త్వికప్రియాః 8

ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మున్నగు వానిని అభివృద్ధి పరచునవియు, పాలు, చక్కెర మొదలగు రస పదార్ధములును, వెన్న నెయ్యి మొదలగు స్నిగ్ధ పదార్ధములును, ఓజస్సును అభివృద్ధి పరచు స్థిరపదార్ధములును, సాత్త్విక స్వభావమును పెంచు హృద్య పదార్ధములును సాత్త్వికులకు ఇష్టమైనవి, (8)

కట్వమ్లలవణాత్యుష్ణ-తీక్షణరూక్షవిదాహినః

ఆహారా రాజసస్యేష్టా దుఃఖ శోకామయ ప్రదాః 9

చేదు, పులుపు, ఉప్పు, కారము, రుచులకు సంబంధించినవి. మిక్కిలి వేడి వస్తువులు, మాడిన పదార్ధములు, దాహము కల్గించునవి. అట్లే దుఃఖము, చింత, రోగములను ఉత్పన్నము చేయు ఆహారపదార్ధములు రాజస స్వభావము గలవారికి ఇష్టములగును. (9)

యాతయామం గతరసం పూతిపర్యుషితం చయత్‌

ఉచ్ఛిష్టమపిచామేధ్యం భోజనం తామసప్రియమ్‌ 10

అర్థ పక్వములైన పదార్ధములు (సరిగా ఉడకనివి, పండనివి) రసహీనములు, దుర్గంధ యుక్తములు (చెడువాసన గలవి) పాసిపోయిన పదార్ధములు, ఎంగిలి వస్తువులు, అపవిత్ర పదార్ధములు మొదలగునవి తామస స్వభావము గలవారికి ఇష్టమైనవి. (10)

అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృషోయ ఇజ్యతే

యష్టవ్యమేవేతి మనఃసమాధాయ స సాత్త్వికః 11

శాస్త్రోక్తమైనదియు, ఈ యజ్ఞము నాకు కర్తవ్యము అని మనస్సున ద ృఢముగా నిశ్చయించుకొన బడినదియు, ప్రతిఫలాపేక్ష లేకుండ చేయబడునదియు ఐన యజ్ఞము సాత్త్విక యజ్ఞము అనబడును. (11)

అభిసంధాయ తుఫలం దంభార్థమపిచైపయత్‌

ఇజ్యతే భరతశ్రేష్ట తం యజ్ఞం విద్ది రాజసమ్‌ 12

కానీ, ఓ అర్జునా! సరిjైున నిష్ట లేకుండ ఆడంబరము కొరకు ఆచరింప

బడునదియు, ప్రతిఫలాపేక్షతో చేయబడునదియు అగు యజ్ఞము రాజస యజ్ఞము అని ఎరుంగుము. (12)

విధిహీనమసృష్టాన్నంమంత్రహీనమదక్షిణమ్‌

శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే 13

శాస్త్రవిధి ననుసరింపనిదియు, అన్నదాన రహితమైనదియు, మంత్ర హీనమైనదియు, దక్షిణలు లేనిదియు, శ్రద్దా రహితమైనదియు అగు యజ్ఞము ‘తామస యజ్ఞము’ అనబడును. (13)

దేవద్విజగురుప్రాజ్ఞపూజసం శౌచమార్జవమ్‌

బ్రహ్మచర్యమహింసా చశారీరం తప ఉచ్యతే 14

దేవతలను, బ్రాహ్మణులను, గురుజనులను, జ్ఞానులను సేవించుట, పవిత్రత (రౌచము) నిరాడంబరత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి శారీరక తపస్సులు. (14)

అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్‌

స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్మయం తప ఉచ్యతే 15

ఉద్వేగమును కలిగింపనిదియు, ప్రియమైనదియు, హితమును గూర్చునదియు, యథార్థమైనదియు అగు భాషణము అట్లే వేదశాస్త్ర పఠనము, పరమేశ్వరుని నామజప సాధన మొదలగునవి యన్నియును వాక్కునకు సంబంధించిన తపస్సులు. (15)

మనఃప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః

భావసంశుద్ధిరిత్యేతత్తపోమానసముచ్యతే 16

మనః ప్రసన్నత, శాంత స్వభావము, భగవచ్చింతన, మనోనిగ్రహము, అంతః కరణ శుద్ధి మొదలగునవి యన్నియును మానసిక తపస్సులు. (16)

శ్రద్దయా పరయా తప్తం తపస్తత్త్రివిధంనరైః

అఫలాకాంక్షిభిర్యకైః సాత్వికం పరిచక్షతే 17

పూర్వోక్తములైన (శారీరిక, వాచిక, మానసిక) తపస్సులను ఫలాకాంక్షలేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పడు వాటిని ‘సాత్త్విక తపస్సులు’ అని యందురు. (17)

సత్కారమానపూజార్థం తపో దంభేన చైవ యత్‌

క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువమ్‌ 18

ఇతరుల నుండి సత్కారములను, గౌరవములను, పూజలను అందుకొనుటకును, అట్లే తదితర స్వార్థ ప్రయోజనముల కొరకును, స్వాభావికముగా గాని, కల్పితముగా గాని చేయబడునవియు, అనిశ్చిత ఫలములను గాని, క్షణిక ఫలములను గాని ఇచ్చునవియు ఐన తపస్సులను ‘రాజస తపస్సులు’ అని యందురు, (18)

మూఢగ్రాహేణాత్మనో యత్పీడయాక్రియతే తపః

పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతమ్‌ 19

మొండి పట్టుదలతో మనోవాక్కాయములకు బాధ కలిగించునవియు, ఇతరులకు కీడు కల్గించుటకై చేయబడునవియు, ఐన తపస్సులను ‘తామస తపస్సులు’ అని అందురు. (19)

దాతవ్యమితి యుద్దానం దీయతే2నుపకారిణే

దేశకాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్క ృతమ్‌ 20

దానము చేయుటయే కర్తవ్యము’ అను భావముతో తగిన ప్రదేశముల యందును, దుర్భిక్షాది కాలముల యందును ఆకలిదప్పులతో బాధపడువారు, అంగవైకల్యము గలవారు, రోగులు మొదలగు వారికిని, బ్రాహ్మణులు, పండితులు, బ్రహ్మచారులు, వానప్రస్తులు మొదలగు పాత్రులైనవారికి ప్రత్యుపకారమును ఆశింపక నిస్వార్థ భావముతో చేయబడు దానము ‘సాత్విక దానము’ అనబడును. (20)

యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్యవా పునః

దీయతే చ పరిక్లిష్టం తద్దానంరాజసంస్క ృతమ్‌ 21

కాని ప్రత్యుపకారమును ఆశించి గాని, ప్రతిఫలాపేక్షతో గాని వివిధములగు ఒత్తిడులకు లోనై గాని బాధపడుచు విధిలేక ఇచ్చు దానమును రాజస దానము అని యందురు. (21)

అదేశకాలే యద్దానమ్‌ అపాత్రేభ్యశ్చదీయతే

అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతమ్‌ 22

సద్భావము లేకుండా, దానము పుచ్చుకొనువారి యెడల గౌరవాదరములను చూపక, తృణీకార భావములతో ఛీóకొట్టుచు, అయోగ్యులకును, అపాత్రులకును దానము, దేశకాలోచితము గాని దానమూ, తామస దానము యనబడును. (22)

ఓంతత్సదితి నిర్దేశో బ్రహ్మణ స్త్రివిధః స్మ ృతః

బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాఃపురా 23

ఓమ్‌, తత్‌, సత్‌ అని మూడు విధములగు పేరు సచ్చిదానంద ఘన పరబ్రహ్మకు నిర్దేశింపబడినవి. ఆ పరమాత్మ నుండియే సృష్ట్యాది యందు బ్రాహ్మణులు, వేదములు, యజ్ఞములు ఏర్పడుట జరిగినది. (23)

తస్మాదోమిత్యుదాహృత్యయజ్ఞదానతపఃక్రియాః

ప్రవర్తంతే విధానోక్తా సతతం బ్రహ్మవాదినామ్‌ 24

కనుక వేదమంత్రములను పఠించువారు శాస్త్ర విహితములైన యజ్ఞదాన తపశ్చర్యలను సర్వదా ‘ఓమ్‌’ అను పరమాత్మ నామమును ఉచ్చరించుచునే ప్రారంభింతురు. (24)

తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపఃక్రియాః

దానక్రియాశ్చవివిధాఃక్రియంతే మోక్షకాంక్షిభిః 25

మోక్షకాంక్ష గలవారు స్వలాభాపేక్ష లేశమాత్రమైనను లేకుండ లోకహితార్థమై యజ్ఞదాన తపశ్చర్యలను ‘ఇదియంతయును పరమాత్మదే’ అను భావము ‘తత్‌’ అను నామమును ఉచ్చరించుచు చేయుదురు. సద్భావేసాధుభావే చసదిత్యేతత్ప్రయుజ్యతే

ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్ధయుజ్యతే 26

ఓ పార్థా ‘సత్‌’ అను పరమాత్మ నామము సత్య భావము నందును శ్రేష్ఠభావము నందును అనగా పరమాత్ముడు నిత్యుడు, శ్రేష్ఠుడు అను భావము నందును ప్రయోగింపబడుచుండును. ఉత్తమ కర్మాచరణము నందును ‘సత్‌’ అను శబ్దము ప్రయుక్తమగుచుండును.

యజ్ఞేతపసి దానే చస్థితికి సదితి చోచ్యతే

కర్మచైవతదర్థీయం సదిత్యేవాభిధీయతే 27

యజ్ఞ దాన తపః క్రియలయందలి నిష్ఠ ఆస్తిక, భావమును ‘సత్‌’ అని యందరు పరమాత్మను ఉద్దేశించి, చేయబడు నిశ్చయాత్మక కర్మలను కూడ ‘సత్‌’ అని యందురు. (27)

అశ్రద్దయాహుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్‌

అసదిత్యుచ్యతే పార్థన చతత్త్స్రేత్యనో ఇహ 28

ఓ అర్జునా! శ్రద్ద (విశ్వాసము) లేకుండ చేయబడు హోమము, ఇయ్యబడు దానము, ఆచరింపబడు తపస్సు, ఇంకను జరుపబడు ఇతర శుభకర్మలన్నియును, ‘అసత్‌’ అని చెప్పబడును. దాని వలన జీవించి యుండగా గాని మరణించిన పిదప గాని ఎట్టి ప్రయోజనమూ కలుగదు.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే

శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశో2ధ్యాయః 17

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి