మొత్తం పేజీ వీక్షణలు

15, మే 2022, ఆదివారం

sri bagavadgeetha - moksha sanyasa yogam- srikrishna preechings - bakthi slokas with meanings

 ఓం శ్రీ పరమాత్మనే నమః

అథ అష్టాదశో2ధ్యాయః

మోక్ష సన్న్యాస యోగ 

అర్జున ఉవాచ

సన్యాసస్య మహబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్‌

త్యాగస్య చ హృషీకేశపృథక్కేశినిషూదన 1

అర్జునుడు పలికెను - ఓ మహాబాహూ! అంతర్యామీ! వాసుదేవా! సన్న్యాస తత్త్వమును, త్యాగతత్త్వమును వేర్వేరుగా తెలిసికొన గోరెదను. (1)

శ్రీ భగవాన్‌ ఉవాచ 

కామ్యానాం కర్మణాం న్యాసం సన్న్యాసం కవయో విదుః

సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః 2

శ్రీ భగవానుడు పలికెను - కామ్యకర్మల త్యాగమునే సన్న్యాసమని కొందరు

పండితులు తలంతురు. కాని విచక్షణాశీలురైన మరికొందరు మాత్రము సర్వకర్మ

ఫలములను త్యజించుటను త్యాగమని పేర్కొందురు. (2)

త్యాజ్యం దోషవదిత్యేకే కర్మప్రాహుర్మనీషిణః

యజ్ఞదానతపఃకర్మన త్యాజ్యమితి చాపరే 3

కొందరు విద్వాంసులు కర్మలన్నియు దోషయుక్తములే గావున వాటిని త్యజింపవలెనని యందురు. కాని, యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు త్యాజ్యములు కావని మరికొందరందురు. (3)

నిశ్చయం శృణు మే తత్రత్యాగే భరతసత్తమ

త్యాగో హిపురుషవ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః 4

ఓ పురుషశ్రేష్ఠా! అర్జునా! సన్న్యాసము, త్యాగము అను రెండు విషయములలో మొదట త్యాగమును గూర్చి నా నిశ్చయమును వినుము. త్యాగము సాత్త్వికము, రాజసము, తామసము అని మూడు విధములుగా చెప్పబడినవి. (4)

యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్‌ 

యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణామ్‌ 5

యజ్ఞదానతపశ్చర్యాది కర్మలు త్యజింపదగవు. అవి అవశ్యము అనుష్టింపదగినవి. ఏలనన యజ్ఞదాన తపస్సులు అను ఈ మూడు కర్మలే  బుద్ధిమంతులైన వారిని పవిత్రమొనర్చును. (5)

ఏతాన్యపి తు కర్మాణిసంగం త్యక్త్వాఫలానిచ 

కర్తవ్యానీతిమే పార్థనిశ్చితంమతముత్తమమ్‌

కావున ఓ పార్థా! ‘‘ఈ యజ్ఞదాన తపోరూప కర్మలను మరియు కర్తవ్య కర్మలను అన్నింటిని ఫలాసక్తులను త్యజించి, అవశ్యమాచరింపవలెను’’ అనునది నా నిశ్చితాభిప్రాయము (6)

నియతస్యతు సన్న్యాసః కర్మణో నోపపద్యతే

మోహాత్తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః 7

(నిషిద్ధ కర్మల, కామ్యకర్మల ఆచరణను త్యాగము చేయుట సముచితమే) కాని శాస్త్ర విహిత కర్మాచరణమును త్యజించుట ఉచితము గాదు. కావున మోహ వశమున దానిని త్యజించుట ‘తామస త్యాగము’ అనబడును. (7)

దుఃఖమిత్యేవయత్కర్మకాయక్లేశభయాత్‌ త్యజేత్‌

సకృత్వా రాజసం త్యాగం నైవత్యాగఫలం లభేత్‌ 8

కర్మలన్నియును దుఃఖకారకములే యని భావించి, శారీరక క్షేశమునకు భయపడి కర్తవ్య కర్మలను త్యజించుటను రాజస త్యాగము అని యందురు. అట్టి త్యాగము వలన ఎట్టి ఫలమూ లభింపదు. (3)

కార్యమిత్యేవయత్కర్మనియతం క్రియతే2 ర్జున

సంగం త్యక్త్వాఫలం చైవ సత్యాగ సాత్త్వికోమతః 9

ఓ అర్జునా! శాస్త్ర విహిత కర్మలను కర్తవ్యములుగా భావించి, వాటి యందలి ఫలాసక్తులను త్యజించి చేయుటయే సాత్త్విక త్యాగము అని భావింపబడును. (9)

నద్వేష్ట్యకుశలం కర్మకుశలేనానుషజ్ఞతే

త్యాగీ సత్త్వసమావిష్టో మేధావీ ఛిన్నసంశయః 10

అకుశల కర్మలను ద్వేషింపని వాడు, కుశల కర్మల యందు ఆసక్తి కలిగియుండని వాడు, శుద్ధ సత్త్వగుణ యుక్తుడు, సంశయ రహితుడు, బుద్ధిమంతుడు అయిన వాడు నిజమైన త్యాగి. (10)

నహిదేహభృతా శక్యం త్యక్తం కర్మాణ్యశేషతః

యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీత్యభిధీయతే 11 

ప్రతి శరీరధారికిని కర్మలను సంపూర్ణముగ త్యజించుట అవశ్యకము. కావున కర్మలను గాక కర్మఫలములను త్యజించినవాడే నిజమైన త్యాగి అని గ్రహింపవలెను. (11)

అనిష్టమిష్టం మిశ్రం చత్రివిధంకర్షణఃఫలమ్‌

భవత్యత్యాగీనాం ప్రేత్యన తు సన్న్యాసినాం క్వచిత్‌ 12

కర్మఫల తాగ్యము చేయని మనుష్యుల కర్మలకైతే మంచి, చెడు, మిశ్రమమని మూడు విధములుగా ఫలములుండును. మరణానంతరము వారు వాటిని తప్పక అనుభవించియే తీరవలయును. కాని కర్మఫల త్యాగమొనర్చిన కర్మయోగులు తమ కర్మల ఫలములను ఏ కాలము నందైనను, ఏ విధముగను అనుభవింపవలసిన పని యుండదు. (12)

పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే

సాంఖ్యేకృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్‌ 13

ఓ మహాబాహూ! సర్వకర్మల సిద్ధికి ఐదు హేతువులు గలవని కర్మలను అంతము చేయు ఉపాయములను తెలుపు సాంఖ్య శాస్త్రము నందు పేర్కొనుట జరిగినది. వాటిని నా నుండి నీవు స్పష్టముగా తెలిసికొనుము. (13)

అధిష్టానం తధాకర్తాకరణం చ పృథగ్విధమ్‌

వివిధాశ్చపృథక్‌ చేష్టాదైవం చైవాత్రపంచమమ్‌ 14

కర్మల సిద్ధి యందు అధిష్ఠానము, కర్త, వివిధములైన కరణములు(సాధనములు) నానావిధ చేష్టలు, దైవము అను ఐదును హేతువులు. 14).

శరీరవాఙ్మనోభిర్యత్‌ కర్మప్రారభతేనరః

న్యాయ్యం వా విపరీతం వా పంచైతే తస్యహేతవః 15

మానవుడు మనస్సు, వాక్కు, శరీరములతో ఆచరించు శాస్త్రానుకోలమైన లేక విపరీతమైన యే కర్మలైనను ఈ jైుదు హేతువులతో ఒప్పుచుండును. (15)

తత్రైవం సతి కర్తారమ్‌ ఆత్మానం కేవలం తు యః

పశ్యత్యకృతబుద్ధిత్వాత్‌ న స పశ్యతి దుర్మతిః 16

అట్లయినప్పటికిని (సర్వ కర్మలకును ఐదు హేతువులే మూలమైనప్పటికిని) విపరీత బుద్ధి కారణమున ఏ మనుష్యుడు కేవలుడు (నిరంజనుడు), శుద్ధ స్వరూపుడైన ఆత్మను సమస్త కర్మలకు కర్తగా భావించునో, అట్టి మలినబుద్ధి గల అజ్ఞాని యథార్థమును గ్రహింపలేడు. (16)

యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే

హత్వాపి స ఇమాన్‌ లోకాన్న హంతి న నిబధ్యతే 17

అంతఃకరణము నందు కర్త ృత్వభావము లేని వాని బుద్ధి ప్రాపంచిక పదార్ధముల యందును అంటుకొనదు. అట్టి పురుషుడు ఈ లోకములను అన్నింటిని హతమార్చినను వాస్తవముగా చంపినవాడు కాడు. అతనిని ఎట్టి పాపములును అంటవు. (17)

జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధాకర్బచోదనా

కరణం కర్మకర్తేతి త్రివిధః కర్మసంగ్రహః 18

జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనునవి మూడు విధములైన కర్మ ప్రేరణములు. కర్త, కరణము, క్రియ అను కర్మ సంగ్రహములు మూడు విధములు. (18)

జ్ఞానం కర్మచకర్తా చత్రిదైవగుణబేదతః

ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్ఛృణు తాన్యపి 19

గుణముల సంఖ్యను వివరించు సాంఖ్య శాస్త్రము నందు జ్ఞానము, కర్మ కర్త అనునవి గుణభేదములతో మూడేసి విధములుగా పేర్కొనబడినవి. వానిని గూర్చి విశదపరచెదను, వినుము. (19)

సర్వభూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే

అవిభక్తం విభక్తేషు తద్‌జ్ఞానం విద్ది సాత్వికమ్‌ 20

వేర్వేరుగా కన్పించు సమస్త ప్రాణుల యందును శాశ్వతుడైన పరమాత్మయే విభాగ రహితుడుగా సమభావముతో స్థితుడై యున్నట్లు జ్ఞానిjైున వాడు చూచును. అట్టి పురుషుని జ్ఞానమును సాత్విక జ్ఞానముగా తెలిసికొనుము. (20)

పృథక్త్వేన తు యద్‌జ్ఞానం నానాభావాన్‌ పృథగ్విధాన్‌

వేత్తి సర్వేషు భూతేషు తద్‌ జ్ఞానం విద్ధి రాజసమ్‌ 21

సమస్త ప్రాణుల యందును నానా విధములైన వివిధ భావములను వేర్వేరుగా భావించు వారి జ్ఞానమును రాజసము అని యెరుంగుము. (21)

యత్తు కృత్స్నవదేకస్మిన్‌ కార్వేసక్తమ హైతుకమ్‌

అతత్త్వార్థవదల్పం చతత్తామసముదాహృతమ్‌ 22

ప్రకృతి కార్యమైన శరీరమునే (శరీరమునకు సంబంధించిన భౌతిక వస్తువులనే) సమస్తముగా భావించి, దాని యందే ఆసక్తిని కల్గించునట్టియు, తాత్త్వికముగా అర్థ రహితమైనదియు, హేతుబద్ధము కానిదియు, తుచ్ఛమైనదియు అగు విపరీత జ్ఞానమును తామసము అని యందురు. (22)

నియతం సంగరహితమ్‌ అరాగద్వేషతః కృతమ్‌

అఫలప్రేప్సునా కర్మ యత్తత్సాత్త్వికముచ్యతే 23

కర్త ృత్వాభిమానము గాని, ఫలాపేక్షగాని లేని పురుషునిచేత రాగద్వేష రహితముగా చేయబడు శాస్త్ర విహితమైన కర్మను సాత్త్విక కర్మయని యందురు. (23)

యత్తుకామేప్సునా కర్మ సాహంకారేణ వాపునః

క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతమ్‌ 24

భోగలాలసుడైన పురుషుని చేతను, అహంకారి చేతను చేయబడు మిక్కిలి శ్రమతో కూడిన రాజస కర్మ అని యందురు. (24)

అనుబంధం క్షయం హింసామ్‌ అనవేక్ష్యచ పౌరుషమ్‌

మోహాదారభ్యతే కర్మయత్తత్తామసముచ్యతే 25

పరిణామము (మంచిచెడ్డలు) హాని, హింస, సామర్థ్యములను చూచుకొనక కేవలము అజ్ఞానముచే ఆరంభింపబడు కర్మలను తామస కర్మలు అని యందురు. (25)

ముక్తసంగో2నహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః

సిద్ద్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్త్విక ఉచ్యతే 26

ఆసక్తిని త్యజించినవాడు, అహంకార రహితముగా భాషించువాడు ధైౖర్యోత్సాహములు గలవాడును, సిద్ది - అసిద్దుల యెడ హర్ష శోకాదివికారములకు లోను కానివాడును అగు పురుషుడు సాత్త్విక కర్త యనబడును. (26)

రాగీ కర్మఫలప్రేప్సుఃలుబ్ధో హింసాత్మకో2శుచిః

హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః 27

ఆసక్తియుతుడు, కర్మఫలములకై ఆరాటపడువాడు, లోభి, ఇతరులను కష్టపెట్టు స్వభావము గలవాడు, అపవిత్ర ప్రవర్తన గలవాడు, హర్షశోకములకు లోనగువాడు రాజసకర్తగా భావింపబడును. (27)

ఆయుక్తఃప్రాకృతః స్తబ్దఃశఠోనైష్క ృతికో2లసః

విషాదీ దీర్ఘసూత్రీచ కర్తా తామస ఉచ్యతే 28

జితేంద్రియుడు కానివాడు, సుశిక్షితుడు కానివాడు, మూర్ఖుడు (మొండివాడు) ధూర్తుడు, అకారణముగ ఇతరుల వృత్తులకు విఘాతము కల్గించువాడు, సదా చింతాగ్రస్తుడు, సోమరి, కార్యాచరణము నందు ఉపేక్షతో కాలము గడుపుచుండువాడు అను (దీర్ఘసూత్రి) - లక్షణములను గలవానిని తామసకర్త అని యందురు. (28)

బుద్దేర్భేదం ధృతేశ్చైవగుణతస్త్రివిధంశృణు

ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేనధనంజయ 29

ఓ ధనంజయా! ఇప్పుడు నీవు బుద్ధి, ధ ృతులను గూడ గుణభేదములు ననుసరించి మూడు విధములగా, విభాగపూర్వకముగా సంపూర్ణముగా నానుండి వినుము. (29)

ప్రవృత్తిం చ నివృత్తిం చకార్యాకార్యే భయాభయే

బంధం మోక్షం చయావేత్తిబుద్ధిః సా పార్థసాత్వికీ 30

ప్రవృత్తి మార్గమును, నివృత్తి మార్గమును, కర్తవ్యమును, అకర్తవ్యమును, భయమును, అభయమును, అట్లే బంధమును, మోక్షమును యథార్థముగా తెలిసికొను బుద్ధిని సాత్వికమైన బుద్ధి యందురు. (30)

యయా ధర్మమధర్మంచ కార్యం చాకార్యమేవచ

అయధావత్‌ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ 31

ఓ పార్థా! ధర్మాధర్మముల యొక్కయు, కార్యాకార్యముల యొక్కయు (కర్తవ్యా కర్తవ్యముల యొక్కయు), యథార్థ తత్త్వములను తెలియజాలని బుద్ధిని రాజసబుద్ధి అని యందురు. (31)

అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా!

సర్వార్థాన్‌ విపరీతాంశ్చబుద్ధిః సా పార్థ తామసీ 32

ఓ అర్జునా! తమోగుణావృతమైనందున అధర్మమును ధర్మముగను, అట్లే ఇతర పదార్ధములను (విషయములను) తద్విపరీతముగను భావించు బుద్ధిని ‘‘తామస బుద్ధి’ అని యందురు. (32)

ధృత్యాయయాధారయతే మనఃప్రాణేంద్రియ క్రియాః

యోగేనావ్యభిచారిణ్యాధృతిః సా పార్థసాత్వికీ 33

ఓ పార్థా ఇటునటు చలింపని ధారణాశక్తితో మనుష్యుడు ధ్యానయోగము ద్వారా మనఃప్రాణేంద్రియ క్రియలను ధారణ చేయు శక్తిని సాత్త్వికధృతి యందురు. (33)

  యయా తు ధర్మకామార్థాన్‌ ధృత్యాధారయతే2ర్జున

ప్రసంగేన ఫలాకాంక్షీధృతిః సా పార్థ రాజసీ 34

కాని, ఓ పార్ధా! అర్జునా! కర్మఫలేచ్చ గల మనుజుడు మిక్కిలి ఆసక్తితో ధర్మార్థ కామ విషయములను ధారణ చేయు శక్తిని ‘‘రాజసధృతి’’ అని యందురు. (34)

యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవచ

న విముంచతి దుర్మేధా ధృతిఃసా పార్థ తామసీ 35

పార్థా! నిద్ర, భయము, చింతా శోకములు, ఉన్మత్తతలను విడువక, దుర్మతిjైున మనుష్యుడు వాటినే సతతము ధారణ చేయుచుండును. అట్టి ధృతిని ‘తామస ధృతి’ అని యందురు. (35)

సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరత్షంభ

అభ్యాసాద్రమతేయత్రదుఃఖాంతం చనిగచ్ఛతి 36

యత్తదగ్రే విషమివ పరిణామే2మృతోపమమ్‌

తత్సుఖం సాత్త్వికం ప్రోక్తమ్‌ ఆత్మబుద్ధి ప్రసాదజమ్‌ 37

ఓ భరతశ్రేష్ఠా! మూడు విధములగు సుఖములను గూర్చియు నేను చెప్పెదను వినుము. ఏ సుఖము నందు సాధకుడు భజన ధ్యాన సేవాదుల నొనర్చి ఆనందించునో, దు:ఖములను అతిక్రమించునో, ప్రారంభము నందు విషతుల్యముగా (దుఃఖకరముగా) గోచరించి నప్పటికిని పరిణామమున అమ ృతతుల్యమై పరమాత్మకు సంబంధించిన విషయములలో నిమగ్నమగునో, అట్టి సుఖమును ‘సాత్త్విక సుఖము’ అని యందురు. (36-37)

విషయేంద్రియసంయోగాత్యత్తదగ్రే2మృతోపమమ్‌

పరిణామే విషమివతత్సుఖంరాజసంస్క ృతమ్‌ 38

విషయేంద్రియ సంయోగము వలన కలుగు సుఖము మొదట భోగానుభవ సమయము నందు అమృత తుల్యముగ అనిపించినను పరిణామమున అది విషతుల్యమగును. అట్టి సుఖమును ‘రాజససుఖ’ మందురు. (38)

యదగ్రేచానుబంధేచ సుఖంమోహనమాత్మనః

నిద్రాలస్యప్రమాదోత్తం తత్తామసముదాహృతమ్‌ 39

నిద్ర, సోమరితనము, ప్రమాదము (మోహము)ల వలన ఉత్పన్నమగు సుఖమును ‘‘తామస సుఖము’ అని యందురు. ఇట్టి సుఖము భోగ సమయము నందును, పరిణామము నందును ఆత్మను మోహింపజేయు చుండును. (39)

న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః

సత్త్వం ప్రకృతి జైర్ముక్తం యదేభిః స్యాత్త్రిభిర్గుణైః 40

పృథ్వి యందు గాని, ఆకాశమునందు గాని, దేవతల యందు గాని, మరేయితర లోకముల యందు గాని, ప్రకృతి నుండి ఉత్పన్నములైన ఈ మూడు గుణములు లేకుండ ఏ ప్రాణియు ఉండదు. (40)

బ్రాహ్మణక్షత్రియ విశాం శూద్రాణాం చ పరంతప

కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైర్గుణైః 41

ఓ పరంతపా! బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల కర్మలునూ, అట్లే శూద్రుల కర్మలునూ వారి వారి స్వాభావికములైన గుణములను బట్టి విభజింపబడి యున్నవి. (41)

శమోదమస్తపఃశౌచం క్షాంతిరార్జవమేవ చ

జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మస్వభావజమ్‌ 42

అంతఃకరణ నిగ్రహము (శమము), ఇంద్రియములను వశము నందుంచు కొనుట (దమము), ధర్మములను పాటించుటలో ఎదురగు కష్టములను సహించుట, బాహ్యాభ్యంతరముల శుచిత్వము, ఇతరుల అపరాధములను క్షమించుట, ఋజుమార్గ జీవనము (మనశ్శరీరేంద్రియముల సరళత్వము)వేదశాస్త్రముల యందును ఈశ్వరుని యందును పరలోకాదుల యందును, విశ్వాసమును కలిగియుండుట, వేదశాస్త్రముల అధ్యయనము, అధ్యాపనము, పరతత్త్వానుభవము - ఇవి యన్నియును బ్రాహ్మణుల స్వాభావిక కర్మలు. (42)

శౌర్యం తేజోధృతిర్ధాక్ష్యం యుద్దేచాప్యపలాయనమ్‌

దానమీశ్వరభావశ్చక్షాత్రం కర్మస్వభావజమ్‌ 43

శార్యము, తేజస్సు, ధైర్యము, దక్షత, యుద్ధము నందు వెన్నుచూపకుండుట, దానముల నిచ్చుట, స్వామి భావముతో ప్రజలను ధర్మపరాయణులనుగా చేయుచు పరిపాలించుట మొదలగునవి యన్నియును క్షత్రియుల స్వాభావిక కర్మలు (43)

కృషి గౌరక్ష్యవాణిజ్యం వైశ్యకర్మ స్వభావజమ్‌

పరిచర్యాత్మకం కర్మశూద్రస్యాపి స్వభావజమ్‌ 44

వ్యవసాయము, గోరక్షణము, క్రయవిక్రయ రూప సత్య వ్యవహారము ఇవి యన్నియును వైశ్యుల స్వాభావిక కర్మలు. అట్లే అన్ని వర్ణముల వారిని సేవించుట శూద్రుల స్వాభావిక కర్మ (44)

స్వేస్వేకర్మణ్యభిరతః సంసిద్దిం లభతే నరః

స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు 45

తమ తమ స్వాభావిక కర్మల యందు తత్పరులైన వారు భగవత్ప్రాప్తి రూప పరమసిద్ధిని నిస్సందేహముగా పొందుదురు. స్వకర్మనిరతులైన మానవులు పరమసిద్ధిని పొందుటకు ఆచరింప వలసిన విధులను తెలుపుచున్నాము వినుము. (45)

యతఃప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్‌

స్వకర్మణా తమభ్యర్త్య సిద్ధిం విందతిమానవ 46

సమస్త ప్రాణుల ప్రాదుర్భావము పరమేశ్వరుని నుండియే జరిగినది. సమస్త జగత్తు నందును అతడు వ్యాపించి యున్నాడు. అట్టి పరమేశ్వరుని తన స్వాభావిక కర్మల ద్వారా పూజించి, మానవుడు పరమసిద్ధిని పొందును. (46)

శ్రేయాన్‌ స్వధర్మోవిగుణః పరధర్మాత్‌ స్వనుష్టితాత్‌

స్వభావనియతం కర్మకుర్వన్నాప్నోతి కిల్బిషమ్‌ 47

బాగుగా ఆచరింపబడిన పరధర్మము కంటెను గుణరహితమైనను స్వధర్మాచరణమే శ్రేష్టమైనది. స్వభావమును అనుసరించి (స్వధర్మ రూప వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి) కర్మలను ఆచరించు మనుష్యునకు ఎట్టి పాపములును ఏ మాత్రము అంటనే అంటవు. (47)

సహజం కర్మకౌంతేయసదోషమపి న త్యజేత్‌

సర్వారంభాహి దోషేణ ధూమేనాగ్నిరివావృతః 48

ఓ కౌంతేయా! (అర్జునా!) దోషయుక్తమైనను సహజమైన కర్మను త్యజింపరాదు. ఏలనన, అగ్ని పొగచే ఆవరింపబడినట్లు కర్మలన్నియును ఏదేని ఒక దోషముతో కూడియే యుండును. (48)

అసక్తబుద్ధిః సర్వత్ర జితాత్మా విగతస్పృహః

నైష్కర్యసిద్ధిం పరమాం సన్న్యాసేనాధిగఛ్చతి 49

ఓ అర్జునా! ప్రాపంచిక విషయములన్నింటి యందు ఆసక్తిలేనివాడును, స్ప ృహ రహితుడును, అంతఃకరణమును, జయించినవాడును అగు పురుషుడు సాంఖ్యయోగము ద్వారా పరమశ్రేష్టమైన నైష్కర్మ్యసిద్ధిని పొందును. (49)

సిద్ధిం ప్రాప్తోయథా బ్రహ్మతధాప్నోతి నిబోధ మే

సమాసేనైన కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా 50

ఓ కౌంతేయా! జ్ఞానయోగము యొక్క పరానిష్ఠమైన నైష్కర్మ్యసిద్ధిని పొందు విధమును, తద్ద్వారా మనుష్యుడు బ్రహ్మప్రాప్తి నందు రీతిని సంగ్రహముగా తెల్చెదను వినుము. (50)

బుద్ద్యావిశుద్దయా యుక్తోధృత్యాత్మానం నియమ్యచ 

శబ్దాదీన్‌ విషయాన్త్యక్త్వారాగద్వేషావ్యుదస్య చ 51

వివిక్తసేవీ లఘ్వాశీయతవాక్కాయమానసః

ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః 52

అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్‌

విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే 53

విశుద్ధమైన బుద్ధి గలవాడై, తేలికjైున సాత్త్వికమైన ఆహారమును మితముగా భుజించువాడు, శబ్దాది విషయములను త్యజించి, పరిశుభ్రమైన ప్రదేశమున ఏకాంతముగా నివసించువాడు, సాత్త్విక ధారణా శక్తి ద్వారా అంతఃకరణేంద్రియముల సంయమము కలిగి, మనోవాక్కాయములను అదుపులో ఉంచుకొనినవాడు, రాగద్వేషములను సర్వధా త్యజించి, దృఢమైన వైరాగ్యమును సంపూర్ణముగా ఆశ్రయించిన వాడు, అహంకారమును, బలమును, దర్పమును, కామక్రోధములను, పరిగ్రహమునకు వదిలిపెట్టి నిరంతరము ధ్యానయోగ పరాయణుడై యుండువాడు, మమతారహితుడు, శాంతియుతుడు ఐన పురుషుడు సచ్చిదానంద పరబ్రహ్మము నందు అభిన్న భావముతో స్థితుడగుటకు పాత్రుడగును. (51,52,53)

బ్రహ్మభూతః ప్రసన్నాత్మాన శోచతి న కాంక్షతి

సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్‌ 54

సచ్చిదానంద ఘన పరబ్రహ్మయందు ఏకీభావస్థితుడై ప్రసన్నమనస్కుడైన యోగి దేనికిని శోకింపడు, దేనినీ కాంక్షిపడు, సమస్త ప్రాణుల యందును సమభావము గల అట్టి యోగి నా పరాభక్తిని పొందును. (54)

భక్త్వామామభిజానాతి యావాన్యశాస్మి తత్త్వతః

తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనంతరమ్‌ 55

బ్రహ్మభూతుడైన యోగి ఈ పరాభక్తి ద్వారా నేనెవరినో? ఎంతటి వాడనో? యధాతథముగ నా తత్త్వమును తెలిసికొనును. అట్లు భక్తితో నా తత్త్వమును గ్రహించిన వెంటనే అతడు నాలో లీనమగును. (55)

సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః

మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్‌ 56

సమస్త కర్మల యందును కర్తృత్వ భావమును వీడి, ఆయా కర్మల ఫలరూపమైన సమస్త భోగములను త్యజించి, నన్నే ఆశ్రయించిన కర్మయోగి కర్మలను అన్నింటిని సర్వదా చేయుచును నా యనుగ్రహముచే సనాతనమైన శాశ్వతమైన పరమ పదమును పొందును. (56)

చేతసా సర్వకర్మాణిమయి సన్న్యస్యమత్పరః

బుద్ధియోగముపాశ్రిత్యమచ్చిత్తః సతతం భవ 57

సర్వకర్మలను నిండు మనస్సుతో నాకే అర్పించి, సమబుద్ధిరూప యోగమును అవలంబించి, మత్పరాయణుడవై సతతము చిత్తమును నా యందే నిల్పుము. (57)

మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్తరిష్యసి

అథ చేత్త్వమహంకారాత్‌ న శ్రోప్యసి వినంక్ష్యసి 58

పైన తెలుపబడిన విధముగా నా యందు చిత్తమును నిల్పినచో, నా యనుగ్రహము వలన సమస్త సంకటముల నుండియు అనాయాసముగా బయట పడగలవు. ఒకవేళ అహంకార కారణమున నా వచనములను పెడచెవిన బెట్టినచో నష్టముల పాలగుదువు. అనగా పరమార్థ పథము నుండి భ్రష్టుడవగుదువు. (58)

యదహంకారమాశ్రిత్యనయోత్స్యఇతి మన్యసే

మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి 59

అహంకార వశమున ‘‘నేను ఈ యుద్ధమును చేయను’’ అని నీవు నిశ్చయించుకొనుట వృథా. ఏలనన నీ స్వభావమే యుద్ధము చేయుటకు నిన్ను పురి కొల్పును. (59)

స్వభావజేన కౌంతేయ నిబద్దఃస్వేనకర్మణా

కర్తుంనేచ్ఛసి యన్మోహాత్కరిష్యస్యవశో2 తత్‌ 60

ఓ కౌంతేయా! మోహ ప్రభావమున నీవు చేయుటకు ఇష్టపడని కర్మను గూడ నీ పరాకృత స్వాభావిక కర్మలచే (సంస్కారములచే) బంధింపబడి, తత్ప్రభావమున నీవు అవశుడవై చేయుదువు. (60)

ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే2ర్జున తిష్టతి

బ్రామయన్సర్వభూతానియంత్రారూఢాని మాయయా 61

అర్జునా! శరీర రూప యంత్రములను అధిరోహించిన సర్వప్రాణుల హ ృదయముల యందు అంతర్యామిగా నున్న పరమేశ్వరుడు తన మాయ చేత వారి వారి కర్మలను అనుసరించి, వారిని భ్రమింప జేయుచున్నాడు. (61)

తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత

తత్ప్రసాదాత్‌ పరాం శాంతిం స్థానం ప్రాప్ప్యసి శాశ్వతమ్‌ 62

ఓ భారతా! (అర్జునా!) అన్ని విధములుగా ఆ పరమేశ్వరునే శరణుజొచ్చుము. అతని క ృప చేతనే పరమశాంతిని, శాశ్వతమైన పరమపదమును పొందగలవు. (62)

ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా

విమృశ్యైైతదశేషేణ యధేచ్ఛసి తధా కురు 63

ఈ విధముగా అత్యంత రహస్యమైన జ్ఞానమును నేను నీకు అందించితిని. ఇప్పడు నీవు ఈ పరమగోప్యమైన జ్ఞానమును పూర్తిగా గ్రహించి, నీకిష్టమైన రీతిగా ఆచరింపుము. (63)

సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః

ఇష్టో2సి మే దృడమితి తతో వక్ష్యామి తే హితమ్‌ 64

సమస్త గోప్య విషయముల యందును పరమ గోప్యమైన నా వచనములను మరొక్కసారి వినుము. నీవు నాకు అత్యంత ప్రియుడవు అగుట వలన నీకు మిక్కిలి హితమును గూర్చి వచనములను మరల చెప్పచున్నాను. (64)

మన్మనాభవ మద్భక్తోమద్యాజీ మాం నమస్కురు

మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియో2సి మే 65

ఓ అర్జునా! నీవు నా యందే మనస్సును నిలుపుము. నా భక్తుడవు కమ్ము. నన్నే సేవింపుము. నాకు ప్రణమిల్లుము, ఇట్లు చేయుట వలన నన్నే పొందగలవు. ఇది ప్రతిజ్ఞాపూర్వకముగా నేను చెప్పుచున్నమాట. ఏలనన నీవు నా కత్యంత ప్రియుడవు. (65)

సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం తరం వ్రజ

అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ 66

సర్వ ధర్మములను అనగా సమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పింపుము.  సర్వశక్తిమంతుడను, సర్వాధారుడను, పరమేశ్వరుడను ఐన నన్నే శరణు జొచ్చుము.  అన్ని పాపముల నుండియు నిన్ను నేను విముక్తుని గావించెదను. (66)

ఇదం తేనాతపస్కాయ నా భక్తాయ కదాచన

న చాశుశ్రూషవే వాచ్యంనచమాంయో2 భ్యసూయతి 67

తపస్సంపన్నుడు కానివానికిని, భక్తి రహితునకును, వినవలెనను కుతూహలము లేని వానికిని నీవు ఈ గీతారూప రహస్యోపదేశమును ఎన్నడునూ తెల్పరాదు. అట్లే నా యందు దోషదృష్టిగలవానికి ఎన్నడునూ ఈ ఉపదేశమును తెలుపరాదు. (67)

య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి

భక్తిం మయి పరాం కృత్వామామేవైష్యత్యసంశయః 68

నా యందు పరమభక్తి గలిగి, ఈ పరమ గోప్యమైన గీతోపదేశమును అనగా గీతా శాస్త్రమును నా భక్తుల హృదయములలో పదిలపరచువాడు నన్నే పొందును. ఇందేమాత్రమూ సందేహము లేదు. (68)

నచ తస్మాన్మనుష్యేషు కశ్చినేప్రియకృత్తమః

భవితానచమేతస్మాత్‌ అన్యఃప్రియతరో భువి 69

నాకు ప్రీతిని గూర్చునట్టి కర్మల నాచరించు మనుష్యులలో అతనిని మించిన భక్తుడెవ్వడును లేడు. అంతేగాక అతనివలె గాని, అతనిని మించి గాని నాకు ప్రియమైన వాడు భూమండలమున మరియొక డెవ్వడును భవిష్యత్తులోను ఉండబోడు. (69)

అధ్యేష్యతే చయ ఇమం ధర్మ్యం సంవాదమావయోః

జ్ఞానయజ్ఞేన తేనాహమ్‌ ఇష్టఃస్యామితి మేమతిః 70

ధర్మయుక్తమైన మన సంవాద రూపమైన ఈ గీతాశాస్త్రమును పఠించువాడు జ్ఞాన యజ్ఞము ద్వారా నన్ను పూజించువాడని నా అభిప్రాయము, (70)

శ్రద్దావానానసూయశ్చ శృణుయాదపియోనరః

సో2పి ముక్తః శుభాన్‌ లోకాన్‌ ప్రాప్నుయాత్పుణ్యకరణామ్‌ 71

శ్రద్దాదరములు గలవాడును, దోషదృష్టి (దోషములెన్ను స్వభావము) లేనివాడును ఐన మనుష్యుడు గీతాశాస్త్రమును వినుట వలన గూడ పాప విముక్తుడై, పుణ్యకర్మలను ఆచరించువారు పొందు ఉత్తమ లోకములను పొందును. (71)

కచ్చిదేతచ్చ్రుతం పార్థ త్వjైుకాగ్రేణ చేతసా

కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ 72

ఓ పార్థా ఈ గీతాశాస్త్రమును నీవు ఏకాగ్ర చిత్తముతో వింటివా? ఓ ధనంజయా! అజ్ఞానజనితమైన నీ మోహము పూర్తిగా నశించినదా? (72)

అర్జున ఉవాచ

నష్టోమోహః స్మ ృతిర్లబ్లాత్వత్ప్రసాదాన్యయాచ్యుత 

స్థితో2స్మిగత సందేహఃకరిష్యే వచనంతవ 73

అర్జునుడు పలికెను - ఓ అచ్యుతా! నీ కృపచే నా మోహము పూర్తిగా తొలగినది. స్మృతిని పొందితిని. ఇప్పుడు సంశయరహితుడనైతిని. కనుక నీ ఆజ్ఞను తలదాల్చెదను. (73)

సంజయ ఉవాచ

ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః

సంవాద మిమమశ్రౌషమ్‌ అద్భుతం రోమహర్షణమ్‌ 74

సంజయుడు పలికెను - ఈ విధముగా శ్రీ వాసుదేవునకును మహాత్ముడైన అర్జునకును మధ్య జరిగిన సంవాదమును వింటిని. అది అదుÄ్భతమైనది. తనువును

పులకింపజేయునది (74)

వ్యాసప్రసాదాచ్చ్రుతవాన్‌ ఏతద్గుహ్యమహం పరమ్‌

యోగం యోగేశ్వరాత్‌ కృష్ణాత్‌ సాక్షాత్‌ కథయతః స్వయమ్‌ 75

వేదవ్యాసుని కృప వలన దివ్యదృష్టిని పొందినవాడనై పరమగోప్యమైన యోగమును (గీతను) యోగీశ్వరుడైన శ్రీకృష్ణభగవానుడు (స్వయముగ అర్జునునకు చెప్పుచుండగా ప్రత్యక్షముగా వింటిని.

రాజన్‌ సంస్మృత్య సంసృత్య సంవాదమ్‌ ఇమమద్భుతమ్‌

కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః 76

ఓ రాజా! (ధృతరాష్ట్రా) శ్రీ కృష్ణ భగవానునకును, అర్జునునకును మధ్య జరిగిన గోప్యమైన ఈ సంవాదము పుణ్యప్రదమైనది అత్యద్భుతమైన ఈ సంవాదమును అనుక్షణము పదే పదే స్మరించుచు నేను నిరంతరము ఆనందమున ఓలలాడుచున్నాను. (76)

తచ్చసంస్మృత్య సంస్మృత్యరూపమత్యద్భుతం హరే

విస్మయో మే మహాన్‌ రాజన్‌ హృష్యామి చపునఃపునః 77

ఓ రాజా! అత్యంత విలక్షణము, పరమాద్భుతము. అపూర్వము అయిన ఆ శ్రీహరి రూపమును పదేపదే స్మరించుచు, నేను పొందుచున్న సంభ్రమాశ్చర్యములకు అవధియే లేదు. తత్ప్రభావమున మరల మరల హర్షోల్లాసములతో పులకిత గాత్రుడనగుచున్నాను.

యత్రయోగీశ్వరః కృష్ణో యత్ర పార్థోధనుర్ధరః

తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ (3 సార్లు) 78

ఓ రాజా! యోగీశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడును, గాండీవధనుర్ధారిjైున అర్జునుడును ఉండుచోట సంపదలును, సర్వ విజయములును, సకలైశ్వర్యములును,

సుస్థిరమైన నీతియు ఉండును - అని నా నిశ్చితాభిప్రాయము. (78)

ఓం తత్పదితి శ్రీమద్బగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే 

మోక్ష సన్యాసయోగో నామ అష్టాదశో -ధ్యాయ ॥18॥

ఓం శాంతిః శాంతిః శాంతిః

సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి