మొత్తం పేజీ వీక్షణలు

24, జనవరి 2023, మంగళవారం

ఉమ్మడి పాలమూరు (మహబూబునగరు) జిల్లాలో క్షేత్రములు...

తిరుమల వేంకటేశ్వరుడే ఉమ్మడి పాలమూరు (మహబూబునగరు) జిల్లాలో ఎన్నో క్షేత్రములలో వెలసినాడు. 


మన్నెముకొండ:

మహబూబ్నగర్ (పాలమూరు)కు 17. కి.మీ. దూరంలో రాయచూర్ రహదారిలో నున్న క్షేత్రం. ఇది మూడు కొండలపైన ఉన్నది. స్వామి స్వయంభువు. కోనేరు కూడా ఎవరూ తవ్వకుండానే తయారయింది. పాలమూరు తిరుపతి అని దీనికి ప్రసిద్ది. లక్ష్మీ నరసింహస్వామిపై ఎన్నో కీర్తనలు రచించిన వాగ్గేయకారులు మన్నెముకొండ హనుమద్దాసుగా రీ ప్రాంతం వారే! 


కురుమూర్తి:

గద్వాల ప్రాంతంలోని వేంకటేశ్వర క్షేత్రం. ఈ క్షేత్రం గురించి ఎంతో సాహిత్యం వెలుగుచూసింది. చారు దరహాస! కురుమూర్తి శైలవాస! అనే మకుటంతో

స్వామి మీద చక్కని శతక రచన చేయడమే గాక శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు గారు ఈ సాహిత్యం మీద ఎంతో కృషి సల్పి శ్రీ కురుమూర్తి క్షేత్ర శతకసాహిత్యం.. అనే పేరిట వివిధకవులు రచించిన పన్నెండు శతకాల ప్రామాణికమైన సంకలనంకూడా  వెలయించినారు. 


దేవుని పాలెము:

ఉమ్మడి పాల మూరు జిల్లాలో రెండు పాలెము లున్నవి. ఒకటి హైదాబాద్ బెంగుళూరు రహదారిలో కొత్తకోటకు సమీపంలోని పాలెం. మరొకటి హైద్రాబాద్ నాగర్ కర్నూలుకు దారిలో బిజినాపల్లి సమీపంలోని పాలెం.

   ప్రత్యేకంగా పేర్కొనవలసివస్తే మొదటిదాన్ని కొత్తకోట పాలె మని, వేంక టేశ్వరస్వామి వెలసినాడు కాబట్టి రెండవ దాన్ని దేవుని పాలె మని వ్యవహరిస్తారు. ఆలయాభివృద్ధికి గ్రామాభివృద్ధికి ఎనలేని  కృషి చేసిన కీ.శే. సుబ్బయ్య గారు ప్రాతఃస్మరణీయులు.  కీ.శే.ఇమ్మడిశెట్టి చంద్రయ్య గారు, శ్రీ కసిరెడ్డి వేంకటరెడ్డి గారు స్వామి కంకితంగా విశిష్టమైన శతకాలను రచించారు. 


మొదలికల్లు:

గద్వాల ప్రాంతంలోని మొదలికల్లు స్వయంభూ వేంకటేశ్వరస్వామి దేవస్థానం. మలదకల్లు మల్దకల్లు అని కూడ పిలుస్తారు. దీనికి ఆదిశిలా క్షేత్ర మని పురాణ ప్రసిద్ధి. స్వామిని తిమ్మప్ప అనీ పిలుస్తారు. 


నారద గిరి:

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్ల నుంచి నాగర్ కర్నూలు రహదారిలో వట్టెం గ్రామం సమీపిస్తుండగా  కుడి వైపు కనిపించేదే నారదగిరి.

    తిరునగరి లక్ష్మణదా సనే సంకీర్తనాచార్యులు స్వామిపై 106 కీర్తనలు రచించినారు.

    ఈ క్షేత్ర మహిమ గురించి "నారదగిరి" అనే పద్యకావ్యం నాచే రచింపబడి శ్రీ కపిలవాయి లింగమూర్తి గారికి అంకితం గావించబడింది. 


తెల్ల రాళ్ళపల్లి:

ఇది కొల్లాపుర  ప్రాంతంలోని సింగవట్నానికి సమీపంలోని క్షేత్రం. ఇప్పుడిది వనపర్తి జిల్లా కిందకు చేరింది. శ్రీ కపిలవాయి లింగమూర్తి గారు స్వామి వారిపై ఒక శతకం రచించారు చాలా కాలం క్రితమే. 


చక్ర తీర్థము:

నాగర్ కర్నూలు సమీపం లోని పెద్ద పల్లి గ్రామంలో నీటిబుగ్గ నుంచి ఉద్భవించినారు స్వామివారు. శ్రీ కపిలవాయి లింగమూర్తిగారు చాలాకాలం క్రితమే "చక్ర తీర్థ మాహాత్మ్య" మనే కావ్యాన్ని రచించినారు. ఇటీవల శ్రీ బాసా వేంకటేశ్వర్లు గా రనే కవి స్వామివారిపై ఒక శతకాన్ని రచించారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి