గొల్లపల్లి వేంకటదాసు
కేశంపేట కుత్తరంగా మూడు కిలోమీటర్ల దూరంలో ఒక గుట్ట ఉంది. దానికి ‘బొల్లిగట్టు’ అని పేరు. ఆ గట్టుపై తిరుమలయ్య అనే దైవం ఉన్నాడు. అతడు ప్రాచీనుడే. పాపిశెట్టి శ్రీరాములు ఇతనిని తన శతకంలో స్మరించినాడు. కాని ఈ దైవాన్ని పెద్దగా పట్టించుకున్న వారులేరు. ఈ గుట్టకు రెండు కిలోమీటర్ల దూరంలో గొల్లపల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో జూపల్లి బాలయ్య అనే భూస్వామి ఉన్నాడు. ఆయన భార్య నారమ్మ వీరి భూములు బొల్లిగట్టు క్రింద ఉన్నవి.
బాలయ్యకు వెంకట్రావు, ధర్మారావు, కృష్ణారావు, బాల కూర్మారావు అని నలుగురు కుమారులు బుచ్చమ్మ అనే కూతురు కలిగింది. వీరిలో పెద్దవాడైన వేంకటరావుగారే ఈ వెంకటదాసు.
దైవం ఎప్పుడు ఎవరిని ఎట్లా తనవైపు ఆకర్షించు ఉంటాడో చెప్పలేము. వేంకటదాసు బాల్యంలో తమ పశువులను బొల్లిగట్టు క్రిందనే మేపుతుండేవాడు. దానిపై రెండు గుండ్లు ఒకదానికొకటి ఆనుకొని చిన్న గుడివలె నిలిచినవి. దానిలో పలగల ఒక రాతికి నామాలు పెట్టి ప్రజలు తిరుమలయ్య అన్నారు.
ఒక పర్యాయం వేంకటదాసు పశువులు మేపుతూ ఆలవోకగా ఆ గుట్టకేసి చూసినాడు. అపుడత నికి ఆగుట్టపైగల గుండ్లపై అతనికి శంఖచక్రాలతో శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాడు. ఇది అతనికి అనుకోని సంఘటన.
దానితో అతడు ఆచుట్టు ప్రక్కల తనవలెనే పశువులను మేపుతున్న బాలురను పిలుచుకొని ఒరేయ్ ఆ గుట్టకేసి చూడండిరా దానిపై వేంకటేశ్వరుడున్నాడు. నాకు కనిపించినాడు అని వారితో చెప్పి తాను రెండు చిన్నచిన్నరాళ్లు తీసుకొని వానినే తాళాలుగా చేసికొని హరేరామ హరేరామ హరేకృష్ణ హరే కృష్ణ అని పాట చెబుతూ వారితో భజన చేయటం ప్రారంభించినాడు.
ప్రతిదినం నాటినుండి పశువుల తోలుకొని రాగానే అతడొకసారి ఆ గుట్టకసి చూసేవాడు. అతనికి దివ్యదర్శనం జరిగేది. దానితో అతడు తోడి పిల్లలు రాకున్నా రెండు రాళ్లు తీసుకొని తాళాలు వాయించుకొంటు దినం కొంతసేపు భజన చేయటం అతని నిత్య కృత్యమై హృదయంలో భక్తి బీజం అంకురించింది.
అట్లా ఉండగా ఒకప్పటి వేసవిలో పిల్లలందరూ కూడి ఒక మామిడితోటకు కాయలకోసరం చెట్లెక్కినారు. అప్పుడు వెంకటదాసు చెట్టుపైనుండిపడి ఒకచేయి విరిగింది. కట్టుకట్టినారు మూడు దినాలు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆ జ్వరంలో శ్రీరాముడు కనిపించి ‘ఏం చేయి విరిగింది ఇంక భజన ఎట్లా చేయవలెనని చింతిస్తున్నావా! భయపడనవసరంలేదు. నీ చేయి ఎప్పటి వలె బాగుపడుతుంది’ అని చెప్పినాడు.
తెల్లవారిన పిమ్మట వెంకటదాసు ఆ స్వప్నం తల్లికి చెప్పినాడు. ఆమె శ్రీరామునికి దండం పెట్టింది. అతడు చెప్పినట్లు వేంకటదాసు చేయి ఎప్పటివలె బాగు పడిరది.
తర్వాత దినదినం వేంకటదాసులో భక్తి పెరుగుతూ అతడు పరధ్యానంగా ఉండసాగినాడు. అదిచూచి తల్లిదండ్రి పెళ్ళిచేస్తే వీని ధ్యాస మారుతుందని సూరమ్మ అనే ఒక కన్యను తెచ్చి వివాహం చేసినారు. అయినా అది భక్తి జీవితానికి ఏమీ ఆటంకం కాలేదు.
అతనికి ఇక ఒక గురువును వెదుకుకోవలెననే సంకల్పం కలిగింది.
అప్పటికి ఉప్పరపల్లెకృష్ణదాసు పేరు చెందినాడు. అతడు షోలీపురం నరసింహ యోగి శిష్యుడు. మనిషి పొట్టిగా కుదిమట్టసంగా ఉండి పొడవాటి గడ్డంతో ఉండేవాడు, బ్రహ్మచారి.
వెంకటదాసు అతని దగ్గరకు వెళ్ళి సాష్టాంగపడి తనను శిష్యునిగా గ్రహించవలసినదని కోరినాడు. అది విని అతను సరే నేను మంత్రోపదేశం చేస్తాను గాని దాన్ని నీవు నిష్టతో అక్షర లక్ష జపించగలవా అని అడినాడు. అది విని వెంకటదాసు మంత్రాన్ని అక్షర లక్ష జపించెవలెనా! లక్ష్యశుద్ధిగా జపించవలెనా అని అడిగినాడు.
ఆ మాట వినగానే కృష్ణదాసుకు అతడు తనకు తగిన శిష్యుడనిపించింది. అతనిని వెంటనే శిష్యునిగా అంగీకరించి తారకముపదేశించినాడు. దానితో అతడి ల్లు విడిచి బొల్లిగట్టుపైననే నివాసం పెట్టినాడు. భక్తులు వచ్చి భజన చేయసాగినారు.
రేమద్దులలో కందూరప్ప సమాధి అయిపోయినాడు. అక్కడ కాళప్పకు తగిన సహవాసం లేకుండ అయింది. ఆయనకు వెంకటదాసు సంగతి తెలిసింది. దానితో అతడు వెంకటదాసును కొంతకాలం ఆశ్రయించినాడు.
వేంకటదాసుకు ఆ గుట్టపైననే ఒక ఆశ్రమం ఏర్పాటుచేయవలెనని ఉండేది. దానిపైగల గుహ చాలా చిన్నది. కాళప్ప అది చూచి వెంకటదాసు దగ్గరకు వచ్చే భక్తులను పట్టుకొని ఆ గుహను విస్తరించవలెనని తలచి వారితో పని ప్రారంభించి క్రమంగా ఆ గుహను ఆరడుగుల వెడల్పు పది అడుగుల పొడవు గలదానిగా త్రవ్వించి ఒక ద్వారం ఎత్తి దానికి గుహాలయం రూపమిచ్చినాడు.
గుట్టపై జరిగిన ఈ మరమ్మత్తు చూసి తురుక దిన్నెలక్ష్మారాయుడు క్రింద ఒక కొలను త్రవ్వించాడు.
వెంకటదాసుకు సంసార జీవితంలో కౌసల్య గోపెమ్మ చంద్రయ్య, విజయలక్ష్మి, శివలీల అని అయిదుగురు సంతానం కలిగినారు. కాని ఆయన సంసారబంధంలో చిక్కలేదు. దాని కతీతంగానే ఉండి రానురాను బొల్లిగట్టు నెక్కడం వీలుగాక ఆ గుట్ట క్రిందనే ఆయన ఆశ్రమం ఏర్పాటు చేసుకొనవలెననే సంకల్పం కలిగి వైకుంఠాశ్రమం పేర అక్కడ ఒక ఆశ్రమం ఏర్పరచుకొని మొదట ఒక ధ్యానమందిరం నిర్మించుకున్నాడు.
బాల్యంలో వెంకటదాసు చీరికపల్లి నుంచి నరసయ్యగారి దగ్గర కొంతకాలం వీధిబడిలో చదివినాడు. ఆనాటి వీధిబడి చదువు గట్టిది. దానిలో శతకాలు బాగా చదివినాడు కాబట్టి పద్యధాటి ఉండేది. ఆ ధాటితో వైకుంఠాశ్రమంలో కొన్ని కీర్తనలు చెప్పినాడట. అవి ఆయన శిష్యుల నోళ్లలోనే ఉండిపోయినవి.
వెంకటదాసు వైకుంఠాశ్రమం స్థాపించిన తర్వాత గొల్లపల్లిలోనే ఉన్న వేంకటదాసు మేనమామ ఒకాయన కాశీయాత్ర చేసి అక్కడినుండి ఒక శివలింగాన్ని తెచ్చి అతనికిచ్చినాడు. ఆయన దానికి పానవట్టం చేయించి తన ఆశ్రమంలో ప్రతిష్టించుకోగా కేశంపేట జగన్నాథరావుగారి భార్య అది చూచి ఒక పార్వతీదేవి ప్రతిమను చేయించి ఇచ్చింది.
ఆ విధంగా అక్కడ ఇపుడు శివాలయం, పార్వతీ ఆలయం, గణపతి ఆలయం, ఆయన ధ్యానమందిరం వెంకటదాసు ఇపుడు గతించినాడు. కాబట్టి అతని సమాధి మందిరము ఒక్కొక్కటిగా వెలసి ఇపుడొక ఆలయ సముదాయంగా రూపొందింది.
భక్తులాయన కిపుడు శిలాప్రతిమను కూడ చేయించినారు. వెంకటదాసు నరసింహయోగివలె ఏ మహిమలు చూపకున్నా అచ్చమైన భక్తిమార్గంలో నిలిచి గురువు అనిపించుకున్నాడు. ఆయనకు గూడ ఎందరో శిష్యులేర్పడినారు. ఆయన అనంతరం వైకుంఠాశ్రమాన్నిపుడు కొల్లాపురం నివాసి కృష్ణవేణమ్మగారు నిర్వహిస్తుంది. ఇది చక్కగా పూలచెట్లతో నెమళ్లు మొదలైన పెంపుడు ప్రాణులతో అచ్చమైన ఆశ్రమ వాతావరణాన్ని తలపిస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి