పేద సంబరము
"అంగుగఁ బంచు" మనుచు ని
చ్చెం గద ద్రవ్యంబు పేద చేతికి విభుడే
పొంగుచు మఖమున..నప్పుడు
బంగారమును నిరుపేద పంచె జనులకున్
దశరథ మహారాజు యాగాశ్వం విడిచి, ఏడాదికి సరయూనది కుత్తరాన అశ్వమేధం చేశాడు. ఇది మూడురోజుల యజ్ఞం. ఎందరో భుజించినారు. అన్నరాశులు గుట్టలుగా కనిపించాయి. (అన్నకూటాశ్చ బహవో దృశ్యంతే పర్వతోపమాః బా.కాం.14-13)
స్థానికులేనా! దూరదూరాల నుంచీ వచ్చారు. తృప్తిగా భోంచేశారు. భోజనాలేనా! సంభావనలూ పెద్దమొత్తాలే! రాజు ఋత్విజులకు భూదానం చేస్తే వారు వద్దంటే పదిలక్షల గోవులను, పదికోట్ల బంగారాన్ని, నలభైకోట్ల వెండిని యిచ్చినాడు.
(గవాం శత సహస్రాణి దశ తేభ్యో దదౌ నృపః దశకోటీ స్సువర్ణస్య రజతస్య చతుర్గుణం 48)
చూడవచ్చిన బ్రాహ్మణులకు కోటి పైడి నాణా లిచ్చాడు.(తతః ప్రసర్పకేభ్యస్తు హిరణ్యం సుసమాహితః జాంబూనదం కోటిసంఖ్యం బ్రాహ్మణేభ్యో దదౌ తదా 51)
ఒక దరిద్ర ద్విజునికి తన చేతి కంకణం యిచ్చినాడు.(దరిద్రాయ ద్విజాయాథ హస్తాభరణ ముత్తమమ్ కస్మైచి ద్యాచమానాయ దదౌ రాఘవ నందనః 52)
అలా అశ్వమేధంలో భూరి దానాలు చేసేప్పుడు ద్రవ్యం ఒకని కందించినాడు "చక్కగా పంచు" మంటూ.. ఆ నిరుపేద సంతోషంతో బంగారాన్ని పంచినాడు. (ద్రవ్యం రాజుదైనా తన చేతిమీదుగా పంచడమూ సంతోషమే కదా!)
అలా దశరథుడు ఇవ్వడమేకాదు. ఇప్పించినాడు కూడ. ఇప్పించినప్పుడు దానం చేసే వారికి కలిగే తృప్తి రెండు రకాలు. 1.రాజు గా రప్పజెప్పిన బాధ్యత నిర్వర్తిస్తున్నా మన్నది. 2. తమ చేతిమీదుగా ఇస్తున్నా మన్నది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి